భారత్ బంద్ ముగిసింది అలా.. స్పందన ఇలా..!
భారత్ బంద్ కు మిశ్రమ స్పందన కనిపించింది. పది కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సమ్మెతో.. ప్రభుత్వ బ్యాంకుల సేవలకు కొంతమేర అంతరాయం కలిగింది. అన్ని రాష్ట్రాల్లో ఆర్టీసీలు, ప్రైవేట్ బ్యాంకులు యథావిధిగా పనిచేయడంతో.. ప్రజలకు అంతంగా ఇబ్బంది కలగలేదు. అయితే జాతీయ స్థాయి పరీక్షలు మాత్రం వాయిదా పడ్డాయి.
కార్మిక సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సహా కేంద్ర ప్రభుత్వం పలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపిస్తూ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా బంద్‌కు దిగాయి. ఈ బంద్‌కు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు. బంద్ లో పాల్గొన్న 25కోట్ల మందికి సెల్యూట్ చేశారు. ముంబయి, చెన్నై, పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ సమ్మెలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముంబయిలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగులు కేంద్ర నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సమ్మెలో పాల్గొన్నారు. చెన్నైలోని మౌంట్ రోడ్‌లో పది యూనియన్లకు చెందిన కార్మికులు బంద్‌లో పాల్గొన్నారు.
భారత్ బంద్ ప్రభావం విజయవాడలో నామమాత్రంగా ఉంది. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఎదుట వామపక్షాలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బైఠాయించి ఆందోళనకు దిగారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో భారీగా మోహరించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో ఇందిరాపార్క్ దగ్గర కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎంజీబీఎస్, జేబీఎస్ దగ్గర బైఠాయించి బస్సుల్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా.. పోలీసులు జోక్యం చేసుకున్నారు.
భారత్ బంద్ సందర్భంగా కోల్ కతా సిలిగురికి చెందిన బస్సు డ్రైవర్లు తమకు తాము కాపాడుకునే ప్రయత్నాలు చేశారు. తలకు హెల్మెట్లు పెట్టుకుని బస్సుల్లోకి ఎక్కారు. బంద్ ప్రభావం పశ్చిమ బెంగాల్‌లోనూ కనిపించింది. కోల్‌కతాలో చెదురుమదురు సంఘటనలు చోటుచేసుకున్నాయి. రాజకీయంగా ఉనికి లేని వాళ్లే బంద్ లకు పిలుపునిచ్చి.. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.
బ్యాంకులు, ఏటీఎం సేవలపై కొంత ప్రభావం కనిపించినా.. ప్రైవేట్ బ్యాంకులు యథావిధిగా పనిచేశాయి. భారత వ్యవసాయ పరిశోధక మండలి నెట్ పరీక్ష వాయిదా పడింది. బుధవారం ఈ పరీక్ష జరగాల్సి ఉంది. సమ్మె కారణంగా ఈనెల 11న పరీక్ష నిర్వహిస్తామని, పరీక్ష కేంద్రం, సమయం మాత్రం మారవని ఐసీఏఆర్ తెలిపింది.