సీఎం జగన్ కాన్వాయ్ వెల్లాకే భోజనం చెయ్యాలి... ప్రజలకు పోలీసుల ఆంక్షలు..?
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానిల ప్రకటన చేసినప్పటి నుంచి... అమరావతి వ్యాప్తంగా తీవ్ర స్థాయి లో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. రైతులు రైతు కుటుంబీకులు మొత్తం రోడ్ల మీదకు చేరి ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెంటనే రాజధాని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రైతుల నిరసనలు ధర్నాలు ఆందోళనలతో అమరావతి మొత్తం అట్టుడుకుతోంది. అమరావతి నిర్మాణం కోసం తాము పంట పండించే భూములకు త్యాగం చేస్తే ఇప్పుడు రాజధాని అమరావతి నుంచి తొలగిస్తామని చెప్పడం దారుణమని వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ మూడు రాజధానిల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఇకపోతే నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతి కి రానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అమరావతి గ్రామాలపై ముఖ్యంగా మందడం గ్రామం లో పోలీసులు తీవ్రమైన ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పటికే అమరావతి లోని అన్ని గ్రామాల లో భారీగా పోలీసులు మోహరించారు. ప్రజలు రోడ్లపైకి రాకుండా బారికేడ్లు ఇనుప కంచెలను ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. అంతే కాకుండా దుకాణ సముదాయాల ను కూడా అన్నింటినీ మూసి వేస్తున్నారు. ఇక మెడికల్ షాపులు మినహా మరే దుకాణాలు కూడా తెరిచేందుకు వీల్లేదంటూ ఆంక్షలు విధిస్తున్నారు పోలీసులు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతి వస్తున్న క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. అమరావతి ప్రజలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ కి అడ్డు తగలకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. దీంతో అమరావతి మొత్తం హాట్ హాట్ గా మారిపోయింది.
అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయానికి వెళ్లిన తర్వాతనే భోజనాలు చేయాలని పోలీసులు చెబుతున్నారు అంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. హోటళ్లను తెరవడం లేదని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. ఐడి ఆధార్ కార్డులను తనిఖీ చేస్తున్నారని అంటున్నారు అమరావతి రైతులు . అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ వెళ్లే మార్గం కావడంతోనే మందడం ప్రధాన రహదారిని తమ ఆధీనంలో ఉంచుకోవాల్సి వస్తుందని పోలీసులు తెలుపుతున్నారు. అందుకే ఈ ప్రాంతంలో ఎక్కువగా నిషేధాజ్ఞలు అమలు లో ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఇలాంటి నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.