ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో సంక్రాంతి సెలవులు ఇవే...!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు సంక్రాంతి పండుగ సెలవులను ప్రకటించాయి. తెలంగాణ రాష్ట్రంలో కేవలం 6 రోజులు మాత్రమే సంక్రాంతి పండుగ సెలవులుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం సంక్రాంతికి పది రోజుల సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. సంక్రాంతి పండగ అంటేనే ఎంతో ప్రత్యేకమైన పండగ. రెండు రాష్ట్రాలలో గంగిరెద్దుల, బసవన్నల కోలాహలం, పిల్లలు ఎగరేసే గాలిపటాలు ఇలా చాలా ఉంటాయి.
ఏపీలోని కొన్ని జిల్లాలలో కోడిపందాలు కూడా జరుగుతాయి. ఏపీలో విద్యాశాఖ ఆదేశాల ప్రకారం జనవరి 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సంక్రాంతి సెలవులుగా ఉన్నాయి. జనవరి 21వ తేదీన పాఠశాలలు మరియు విద్యాసంస్థలు తెరచుకోనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం జనవరి 11వ తేదీ నుండి జనవరి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు కొనసాగనున్నాయి.
జూనియర్ కళాశాలలకు కూడా ఇవే సెలవులు వర్తించనున్నాయి. కొన్ని కార్పొరేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలు ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోవటంలేదని సమాచారం. అధికారులు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోని విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జనవరి నెల 17వ తేదీన పాఠశాలలు, విద్యాసంస్థలు తెరచుకోనున్నాయి.
పలు కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు సాధారణంగా సెలవుల్లో కూడా స్పెషల్ క్లాసుల పేరుతో ఇంటర్, పదో తరగతి విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తూ ఉంటాయి. విద్యాశాఖ స్పెషల్ క్లాసుల పేరుతో తరగతులను నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు సెలవులు పొడిగించిన విషయం తెలిసిందే. అందువలన ప్రభుత్వం సంక్రాంతి పండుగకు సెలవులను కేవలం 6 రోజులు మాత్రమే ప్రకటించిందని సమాచారం. తెలంగాణ రాష్ట్రంలోని మిషనరీ పాఠశాలలకు మాత్రం ఈ సెలవులు వర్తించవని సమాచారం. పలు విద్యాసంస్థలు కార్మికుల సమ్మె వలన సిలబస్ పెండింగ్ లో ఉండిపోయిందని సెలవుల్లో కోత విధించి తరగతులు నిర్వహించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.