ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఉన్నట్టుండి అంత మాట అనేశాడేంటి..?

Chakravarthi Kalyan
ఆళ్ల రామకృష్ణారెడ్డి.. జగన్ కు సన్నిహితుడుగా పేరున్న ఎమ్మెల్యే. వైసీపీ కోసం ఎన్నో పోరాటాలుచేసిన ఎమ్మెల్యే. మంగళగిరిలో లోకేశ్ ను ఓడించిన ఎమ్మెల్యే.. పాపం మంత్రి కావలసిన వాడు.. ఎమ్మెల్యేగా మిగిలాడు. ఆయన తాజాగా చేసిన కొన్ని కామెంట్లు వివాదాస్పదం అవుతున్నాయి. ఆసక్తి రేపుతున్నాయి. ఏపీలో విద్యా శాఖ అధికారులు నిద్రపోతున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మేలో ప్రభుత్వ పాఠశాలకు పుస్తకాలు కావాలని ఇండెంట్ పెడితే జనవరిలో ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాదు.. 2019 జూన్‌లో ఇవ్వాల్సిన పుస్తకాలు 2020 జనవరిలో కూడా పంపిణీ చేయలేదని మండిపడ్డారు. తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో ఇప్పటికీ పాఠశాలకు పుస్తకాలు పంపిణీ కాకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఒక్క మంగళగిరిలోనే కాదు.. జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. అదేమని అడిగితే.. ప్రభుత్వం నుంచి పుస్తకాలు రాలేదని డీఈవో చెబుతున్నారని ఆళ్ల అంటున్నారు. ఇలాగైతే.. మార్చిలో జరిగే పరీక్షల్లో విద్యార్థులు ఏం చదివి రాస్తారని ఆళ్ల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు.

సీఎం జగన్, విద్యా శాఖ మంత్రి మంచి ఆశయంతో పని చేస్తున్నా... విద్యా శాఖ అధికారుల పనితీరు అధ్వాన్నంగా ఉందని ఆళ్ల రామకృష్ణారెడ్డి అంటున్నారు. కనీసం వచ్చే ఏడాది అయినా సకాలంలో పుస్తకాలు అందించాలని ఆర్కే విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదేనైనా ఆళ్ల రామకృష్ణారెడ్డి తీరును మెచ్చుకోవాల్సిందే. అసలు ఎంత మంది ఎమ్మెల్యేలు ఇలాంటి ప్రజా సమస్యలపై దృష్టి పెడుతున్నారు.

ఎంతసేపూ రాజకీయ విమర్శలు తప్పితే.. ఇలా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది అని పరిశీలించే ఎమ్మెల్యేలు ఎంత మంది ఉన్నారు. అధికారంలో ఉన్నాం కదా.. అంతా బ్రహ్మాండంగా ఉందనే టైపు మాటలు చెప్పడమే కాదు.. ఉన్న లోపాలను కూుడా ఎత్తి చూపుతున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఖరిని మెచ్చుకుని తీరాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: