సెల్ ఫోన్ పోయిందా.... ఈ వెబ్ సైట్ లో ఫిర్యాదు చేస్తే సులభంగా దొరుకుతుంది... !

Reddy P Rajasekhar

కేంద్ర ప్రభుత్వం సెల్ ఫోన్ వినియోగదారులు ఫోన్ ను పోగొట్టుకున్నా, ఫోన్ ను ఎవరైనా దొంగలించినా ఆ ఫోన్ ఎక్కడుందో కనిపెట్టటానికి, ఆ ఫోన్ ను పని చేయకుండా చేయటానికి ప్రత్యేకమైన వెబ్ పోర్టల్ ద్వారా సేవలు అందిస్తోంది. 2018 సెప్టెంబర్ నెలలో ఈ సేవలు ప్రారంభం కాగా దేశ రాజధాని ఢిల్లీకి కూడా ఈ సేవలను ప్రభుత్వం విస్తరించింది. దేశవ్యాప్తంగా ఈ సేవలను 2020 సంవత్సరంలో విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. 
 
సెల్ ఫోన్ ను పోగొట్టుకున్నా లేదా సెల్ ఫోన్ ను ఎవరైనా దొంగలించినా సెల్ ఫోన్ కు ఉండే ఐఎంఈఐ నంబర్ ద్వారా ఫోన్ పోయిందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చి ఆ వివరాలను, వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలను పోర్టల్ లో నమోదు చేయాలి. అలా చేస్తే ఆ ఫోన్ ను అన్ని నెట్వర్క్ ల పరిధిలో పని చేయకుండా చేస్తారు. వెబ్ సైట్ లో వివరాలను నమోదు చేస్తే ఆ సెల్ ఫోన్ లో వేరే సిమ్ కార్డు వేసినా వారి వివరాలు కూడా తెలుస్తాయి. 
 
ఫోన్ పోయిన వెంటనే సెల్ ఫోన్ వినియోగదారులు www.ceir.gov.in పోర్టల్ లో ఐఎంఈఐ నంబర్, ఫిర్యాదు వివరాలు, వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలను నమోదు చేయాలి. ఈ సాఫ్ట్ వేర్ ను వినియోగిస్తే చోరీకి గురైన ఫోన్ మాత్రమే పని చేయకుండా ఉంటుందని అదే ఈ సాఫ్ట్ వేర్ ప్రత్యేకత అని టెలికాం కార్యదర్శి అన్షు ప్రసాద్ తెలిపారు. ఎవరైనా ఫోన్లను చోరీ చేసినా విక్రయించడం కుదరదని అన్షు ప్రసాద్ తెలిపారు. 
 
టెలికాం మంత్రి రవి శంకర్ ప్రసాద్ సెల్ ఫోన్ లో వేరే సిమ్ కార్డు వేసి ఎక్కడ వాడినా తెలిసిపోతుందని పోలీసులు వెంటనే ఆచూకీ కనిపెట్టటం వీలవుతుందని చెప్పారు. మరోవైపు ప్రభుత్వం హూవావె సహా అన్ని సంస్థలకు 5జీ స్పెక్ట్రమ్ ను కేటాయించనుంది. సూత్రప్రాయంగా ఈ విషయం గురించి నిర్ణయం తీసుకున్నామని రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. భవిష్యత్తు అత్యధిక వేగంతో డేటా బదిలీకి వీలు కల్పించే 5జీ టెక్నాలజీపైనే ఆధారపడి ఉందని రవి శంకర్ ప్రసాద్ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: