పాకిస్థాన్ వెళ్లిపొమ్మంటారా..ఎంత దైర్యం... మంత్రి సంచలన వ్యాఖ్యలు..?
కేంద్ర పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకు వచ్చినప్పుడు నుంచి పౌరసత్వ సవరణ చట్టం ఎన్ఆర్సి కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న విషయం తెలిసింది. ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు సైతం పౌరసత్వ సవరణ చట్టం ఎన్ఆర్సి ని వ్యతిరేకిస్తూ తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తరప్రదేశ్లో అయితే ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆందోళనకారులు ప్రభుత్వ ఆస్తుల పై విరుచుకు పడుతు విధ్వంసం సృష్టిస్తున్నారు. రోడ్ల పైకి చేరి నిరసనలు వ్యక్తం చేస్తుండడంతో దేశం మొత్తం ఉద్రిక్తంగా మారింది.
పౌరసత్వ సవరణ చట్టం ఎన్ఆర్సి కి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న ముస్లిం లను ఉద్దేశించి ఉత్తరప్రదేశ్ లోని మీరట్ ఎస్పి అఖిలేష్ నారాయణ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. గో బ్యాక్ టు పాకిస్తాన్ అంటూ మీరట్ ఎస్పీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే మీరట్ ఎస్పీ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఖండించారు. మీరట్ ఎస్పీ నిజంగా వీడియోలో కనిపించినట్లుగా ముస్లింలు పాకిస్థాన్ వెళ్లిపోవాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఉంటే ఖచ్చితంగా మీరట్ ఎస్పీ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మైనార్టీల మంత్రిగా స్పందిస్తున్నాను అంటూ ఆయన తెలిపారు . అల్లరి మూకలు కావచ్చు లేక పోలీసులు కావచ్చు తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. మీరట్ ఎస్పీ అఖిలేష్ నారాయణ సింగ్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ వివాదాస్పదమైనవే . సాక్ష దారాలు క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి వాటికి చోటు లేదని ఆయన పేర్కొన్నారు. మీరట్ లోని లిసారి గేటు వద్ద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న ముస్లిం లను ఉద్దేశించి ఎస్పి అఖిలేష్ నారాయణ సింగ్... ఇక్కడ ఉండటం ఇష్టం లేకుంటే పాకిస్తాన్ వెళ్లిపోండి ఇక్కడ తిండి తింటూ పాకిస్థాన్ ను పొగడడానికి సిగ్గులేదా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.