నక్సల్స్ కు వాకీ టాకీలా.. ? పోలీసుల్లో ఆందోళన..!
నక్సల్స్ వాకీ టాకీలు వాడుతున్నారా? భద్రాచలంలో ఆన్‌లైన్‌లో పది వాకీ టాకీలు ఆర్డర్ ఇచ్చిందెవరు? దుమ్ముగూడెంలో మిస్ అయిన నాలుగు వాకీ టాకీలు ఎక్కడికెళ్లాయి? పోలీసులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు?
తక్షణం సమాచారం చేరేవేసేందుకు భద్రతా బలగాలు, పోలీసులు వాకీ టాకీలు వాడుతుంటారు. శాంతి భద్రతలను అదుపులో పెట్టేందుకు పోలీసులకు ఇవి ఎంతగానో సాయపడుతుంటాయి. ప్రైవేట్ భద్రతా ఏర్పాట్లలోనే వీటి ఉపయోగం ఇటీవల పెరిగింది. విషయం ఏదైనా సెక్యూరిటీ పర్పస్‌లోనే వాకీ టాకీలను చూస్తారు. అలాంటి వాకీ టాకీలను నక్సల్స్ కూడా ఉపయోగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల భద్రాచలంలో పోలీసులకు తెలిసిన ఒక అంశం దీనినే బలపరుస్తోంది. భద్రాచలానికి చెందిన ఒక ఎలక్ట్రానిక్స్ షాప్ ఓనర్ ఇటీవల ఆన్‌లైన్‌లో పది వాకీ టాకీలను ఆర్డర్ చేశాడు. అందులో నాలుగు ఈ మధ్య రిసీవ్ చేసుకున్న అతను... వాటిని దుమ్ముగూడేనికి చెందిన వ్యక్తికి అందజేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న పోలీసులు ఆ వాకీ టాకీలు ఎక్కడికి వెళ్లాయో తెలియక ఆందోళన చెందుతున్నారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఇలా వాకీ టాకీలు రావడం.. అవి ఎక్కడికి వెళ్లాయో తెలియకపోవడం కలకలం రేపుతోంది. అయితే అవి చేరాల్సిన వారికే చేరినట్లు ప్రచారం జరుగుతోంది. దుమ్ముగూడేనికి చేరువలోనే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన సుక్మా, బీజాపూర్ జిల్లాలు ఉన్నాయి. దుమ్మగూడెం, చర్ల మండలాలు చత్తీస్‌గఢ్‌కు సరిహద్దుల్లో ఉంటాయ్. ఈ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం కూడా ఎక్కువే. అందుకే మావోయిస్టులే వాకీ టాకీలు తెప్పించుకుని ఉంటారని అనుమానిస్తున్నారు.
ఒక్కో వాకీ టాకీ విలువ నాలుగున్నర లక్షలు ఉంటుందని అంటున్నారు. పైగా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి తెప్పించుకున్న వాకీ టాకీలు అత్యంత అధునాతనమైన టెక్నాలజీకి చెందినవిగా చెబుతున్నారు. ఇవి ఒక్కోటి కొన్ని కిలోమీటర్ల పరిధిలో సమాచారం చేరవేస్తాయి. ఈ విషయం తెలిసి పోలీసులు అప్రమత్తం అయ్యే సరికే నాలుగు వాకీ టాకీలు తీసుకున్న వ్యక్తి దుమ్ముగూడెం నుంచి పరారైనట్లు తెలుస్తోంది. దీంతో అవి మావోయిస్టులకు చేరి ఉంటాయని బలంగా నమ్ముతున్నారు పోలీసులు. అయితే అధికారికంగా వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు.