అయ్యో పాపం.. చంద్రబాబుకు ఎలాంటి పరిస్థితి వచ్చింది..?
టీడీపీ అధినేత చంద్రబాబు పరిపాలన తీరు ఎలా ఉన్నా.. ఆయనకో మంచి పేరు ఉంది. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కువగా ఆయన ప్రజల మధ్య ఉంటారు. ఏదో ఒక పేరుతో ఆయన పర్యటనలు చేస్తుంటారు. అలాంటి చంద్రబాబుకు ఇప్పడు గడ్డు పరిస్థితి వస్తోంది. ప్రతిపక్ష నేత, టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటనను రద్దు చేసుకున్నారని తెలుస్తోంది.
వాస్తవానికి చంద్రబాబు జనవరి రెండు, మూడు తేదీలలో ఆయన పర్యటించవలసి ఉంది. కాని విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రతిపాదనను చంద్రబాబు వ్యతిరేకించడం ఉత్తరాంధ్రలో పార్టీకి ఇబ్బందిగా మారింది. ఇప్పుడు చంద్రబాబు కు ఇదే తలనొప్పి అయ్యింది. దీని కారణంగానే చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు పర్యటనకు రావడం మంచిది కాదని ఉత్తరాంధ్ర నేతలు చంద్రబాబుకి చెప్పారట.
దీంతో చేసేది లేక ఆయన పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర నాయకత్వం ఉత్తరాంధ్ర నేతలకు సమాచారం ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు సీఎం జగన్ విశాఖ రాజధాని ప్రకటనకు జై కొడుతున్నారు. విశ్వనగరంగా అబివృద్ది చెందుతున్న విశాఖపట్నం ఏపీ రాజధానిగా అన్ని విధాలుగా అనువైనదని టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.
విశాఖలో పలు రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివసిస్తుంటారని, ఎంతో శాంతియుతంగా ఉంటుందని ఆయన అన్నారు. విశాఖ అన్ని విధాలుగా అర్హమైన నగరమని , జిఎన్ రావు కమిటీ నివేదికను సమర్దిస్తున్నానని గంటా అన్నారు. విశాఖ వాసిగా, ఇక్కడే అనేక పదవులు చేసిన వ్యక్తిగా తాను ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తానని ఆయన చెప్పారు. పార్టీ అమరావతిపై ఒక నిర్ణయం తీసుకున్నా తాను మాత్రం విశాఖను స్వాగతిస్తానని ఆయన అన్నారు. గంటా మాత్రమే కాదు.. విశాఖలోని టీడీపీ నేతలంతా సమావేశమై జగన్ నిర్ణయాన్ని స్వాగతించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.