దేశంలోనే అత్యంత శక్తిమంతులైన నరేంద్రమోడి, అమిత్ షా ల ఆధిపత్యాన్ని జగన్మోహన్ రెడ్డి సవాలు చేసినట్లే అనిపిస్తోంది. పదేళ్ళ క్రితం సోనియాగాంధి ఆధిపత్యాన్ని ఎలా సవాలు చేశారో ఇపుడూ అదే పంథాలో సవాలు విసిరారు. ఎన్ఆర్సీ చట్టాన్ని ఏపిలో అమలు చేసే ప్రసక్తే లేదని జగన్ తాజగా కడప బహిరంగసభలో స్పష్టంగా ప్రకటించారు. అసలే దేశంలోని అనేక రాష్ట్రాల్లో పరిస్ధితి ఎన్ఆర్సీ చట్టానికి వ్యతిరేకంగా అట్టుడికిపోతున్నాయి. దానిమీద జార్ఖండ్ రాష్ట్రం ఎన్నికల్లో బిజెపి బోల్తా పడింది.
వివిధ రాష్ట్రాల్లో అల్లర్లను అదుపు చేయలేక, జార్ఖండ్ లో ఓటమి అవమానంతో మండిపోతున్న మోడి, అమిత్ షాలకు జగన్ చేసిన ప్రకటన ఒంటికి కారం రాసినట్లే ఉండుంటుంది. ఎన్ఆర్సీ అములుకు రాష్ట్రప్రభుత్వం వ్యతిరేకమంటూ జగన్ చేసిన ప్రకటన మోడి, అమిత్ లకు సవాలు విసరటంగానే భావించాలి. అసలే కొన్ని విషయాల్లో జగన్ అంటే కేంద్రప్రభుత్వంలోని పెద్దలకు మంటగా ఉంది. దానికితోడు గోరుచుట్టు మీద రోకలిపోటన్నట్లు ఇపుడు ఎన్ఆర్సీ చట్టాన్ని వ్యతిరేకించటం.
పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్లు, విద్యుత్ రంగంలో పిపిఏల సవరణలు, మూడు రాజధానుల ప్రతిపాదనలు కేంద్రానికి ఏమాత్రం ఇష్టం లేనిదే. రివర్స్ టెండర్లు, పిపిఏల సవరణలను కేంద్రం అడ్డుకునే ప్రయత్నాలు గట్టిగానే చేసింది. అయితే ఇక్కడున్నది జగన్ అన్న విషయం బిజెపి మరచిపోయింది. చంద్రబాబునాయుడు లాగే జగన్ ను కూడా బెదిరించవచ్చని అనుకున్నది.
అయితే కేంద్రం బెదిరింపులను జగన్ ఏమాత్రం లెక్కచేయలేదు. తాను అనుకున్న పద్దతిలోనే ముందుకుపోతున్నారు. కేంద్రాన్ని కన్వీన్స్ చేయటానికి ప్రయత్నించి సాధ్యంకాక వాళ్ళని వదిలిపెట్టేశారే కానీ తాను మాత్రం వెనక్కు తగ్గలేదు. దాంతో జగన్ ను ఏమీ చేయలేక కేంద్రమే వెనక్కు తగ్గింది. ఇటువంటి పరిస్ధితుల్లోనే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన చేశారు. సరే దీనిపై అనేక రాద్దాంతాలు జరుగుతున్నాయనుకోండి అదివేరే సంగతి.
ఈ విషయం ఇలాగుండగానే హఠాత్తుగా ఎన్ఆర్సీ అమలును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించటమంటే మామూలు విషయం కాదు. తనకు కేంద్రం వ్యతిరేకంగా ఉందన్న విషయం తెలిసే జగన్ తన నిర్ణయాన్ని ప్రకటించారంటే మోడి, అమిత్ లను చాలెంజ్ చేయటానికే డిసైడ్ అయినట్లు అర్ధమైపోతోంది. మరి చాలెంజ్ పరిణామాలు ఎలాగుంటాయో చూడాల్సిందే.
మరింత సమాచారం తెలుసుకోండి: