మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల ఫ్యామిలీలో విషాదం...!
రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం జిల్లాకు చెందిన దివంగత తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న పరిటాల శ్రీరాములయ్య సోదరుడు పరిటాల గజ్జలప్ప ఈరోజు ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పరిటాల ఫ్యామిలీలో పరిటాల గజ్జలప్ప మృతితో విషాదం నెలకొంది.
తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖ నేతలు, పరిటాల ఫ్యామిలీ అభిమానులు పరిటాల ఇంటికి చేరుకుంటున్నారు. టీడీపీ నేతలు పరిటాల ఇంటికి చేరుకొని సంతాపాన్ని వెలిబుచ్చారు. పరిటాల రవి కొడుకు పరిటాల శ్రీరామ్ వెంకటాపురంలో పరిటాల గజ్జలప్ప అంత్యక్రియలు జరగనున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. పరిటాల రవి సతీమణి పరిటాల సునీత పరిటాల గజ్జలప్ప భౌతిక ఖాయానికి నివాళులర్పించారు.
పరటాల గజ్జలప్ప ఇంతకాలం తమకు పెద్దదిక్కుగా ఉన్నాడని చెబుతూ పరిటాల కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రజా పోరాటాలలో పరిటాల శ్రీరాములయ్యతో పాటు పరిటాల గజ్జలప్ప కూడా పాల్గొని ఎన్నో పోరాటాలు చేశారు. తెలుగుదేశం పార్టీ నేత కాలువ శ్రీనివాసులు, ఇతర నేతలు పరిటాల గజ్జలప్ప భౌతిక ఖాయానికి నివాళులర్పించారు.
గతంలో ఒక కేసులో రెండు సంవత్సరాల పాటు పరిటాల శ్రీరాములయ్యతో పాటు పరిటాల గజ్జలప్ప జైలు జీవితం గడిపారు. ఒక వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో వీరిరువురితో పాటు మరో 46 మందిపై హత్య కేసు నమోదైంది. అనంతపురం జిల్లాలో పరిటాల ఫ్యామిలీకి ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. పరిటాల రవి హత్య తరువాత రవి భార్య పరిటాల సునీత రాప్తాడు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికల్లో రాప్తాడు నుంచి పరిటాల శ్రీరామ్ టీడీపీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఎన్నికల ఫలితాల తరువాత పరిటాల కుటుంబం బీజేపీలో చేరుతుందని వార్తలు వచ్చినా తాము తెలుగుదేశంలోనే కొనసాగుతామని పరిటాల ఫ్యామిలీ స్పష్టత ఇచ్చింది.