కరెంట్ బిల్లు ఎక్కువొస్తే పింఛన్ కట్... రేషన్ కూడా... ?

Reddy P Rajasekhar

ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్, పెన్షన్ కార్డులను మంజూరు చేయటానికి కరెంట్ బిల్లులను పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.  ఏపీలో కరెంట్ బిల్లు 200 యూనిట్లు దాటితే రేషన్ కట్, 300 యూనిట్లు దాటితే పెన్షన్ కట్ చేస్తారనే నిబంధన రేషన్, పెన్షన్ కార్డుదారులకు నిద్ర పట్టనివ్వడం లేదు. గ్రామ, వార్డు వాలంటీర్లు కరెంట్ బిల్లు ఎక్కువ కడుతున్నారా...? తక్కువ కడుతున్నారా..? అనే విషయాలను సర్వే చేస్తున్నట్టు తెలుస్తోంది. 
 
కొందరు ఇంటికి రెండు మూడు వేరువేరు మీటర్లను వాడుతున్నారు. కానీ రెండు మూడు మీటర్లను వాడినా అధికారులు భార్యాభర్తలు ఇద్దరి పేర్లపై ఉన్న అన్ని సర్వీసులను కలిపి ఒకే యూనిట్ గా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. అధికారులు గృహ సముదాయాలతో పాటు వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక సర్వీసులను కూడా ఒకే యూనిట్ గా పరిగణలోకి తీసుకోనున్నారు. గతంలో ప్రభుత్వం సొంత పట్టా భూముల్లో నిర్మించుకున్న ఇళ్లను మాత్రమే సొంత భవనాలుగా పరిగణించేది. 
 
కానీ రేషన్, పెన్షన్ కార్డులకు కరెంట్ బిల్లు నిబంధన ఉండటంతో అధికారులు బీఫారాల్లో రోడ్డు పక్కన స్థలాలను ఆక్రమించుకొని ఉంటున్న వారు, స్వాధీనాల్లో ఉన్న ఇళ్లలో ఉన్నవారిని కూడా ఇకనుండి ఈ జాబితాలో చేర్చనున్నారు. బీఫారాల్లో ఉన్న ఇళ్లలో విద్యుత్ సంస్థలు ఇంట్లో ఎవరు ఉంటున్నారో వారి పేరు మీద మాత్రమే సర్వీస్ ను మంజూరు చేయనుంది. కాబట్టి ఇల్లు బీఫారం అని లేదా ఇతర కారణాలను అధికారులకు చెప్పే అవకాశం ఉండదు. 
 
ఇళ్లను వేరే వాళ్లకు అమ్ముకొని విద్యుత్ సర్వీస్ పేర్లను మార్చుకోని వారికి ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. సర్వీస్ పేర్లు మార్చుకోకపోతే ఆ విద్యుత్ కనెక్షన్ కూడా ఇల్లు అమ్మినవారి పేరు మీదకే వచ్చే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారికి కూడా సమస్యలు తప్పవని సమాచారం. అద్దెకు ఇంట్లో ఉండేవాళ్లు ఎక్కువ కరెంట్ ను వినియోగిస్తే ఆ ఎఫెక్ట్ ఇల్లు అద్దెకు ఇచ్చిన వారిపై పడనుంది. అధికారులు అద్దెకు ఇల్లు ఇచ్చేస్థాయిలో ఉన్నవారికి పెన్షన్, రేషన్ అవసరం ఏముంటుందని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: