ఏపీలో కాల్ మనీ ప్రకంపనలు... వేధింపులు భరించలేక దంపతుల ఆత్మహత్య...!

Reddy P Rajasekhar

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాల్ మనీ మరలా పడగ విప్పుతోంది. వేలల్లో తీసుకున్న అప్పులకు లక్షలకు లక్షలు వడ్డీ వసూలు చేస్తూ ఆ వడ్డీలు కట్టినా వేధింపులను ఆపటం లేదు. కాల్ మనీ వేధింపులు భరించలేక రెండు రోజుల ముందు ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయగా ఈ ఘటన మరవకముందే మంగళగిరిలో తాపీమేస్త్రీ జంట ఆత్మహత్య చేసుకున్నారు. కాల్ మనీ గ్యాంగ్ కు అసలు, వడ్డీ కట్టినా వేధింపులు ఆగకపోవటంతో తాపీ మేస్త్రీ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. 
 
మంగళగిరి మండలం కాజలో నివాసం ఉంటున్న పొలిశెట్టి పూర్ణచంద్రరావు, పొలిశెట్టి లక్ష్మి దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వడ్డీ వ్యాపారుల వద్ద 30వేల రూపాయలు, 20వేల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. వడ్డీ వ్యాపారులు 30వేల రూపాయలకు లక్షన్నర రూపాయలు, 20 వేల రూపాయలకు లక్ష రూపాయలు కట్టాలని దంపతులను బెదిరించారు. దంపతులు అప్పు చెల్లించి వడ్డీ, చక్ర వడ్డీ కట్టినా వేధింపులను మాత్రం ఆపలేదు. 
 
అప్పుకు 10రూపాయల నుండి 15 రూపాయల వడ్డీ కట్టాల్సిందేనని వడ్డీ కట్టకపోతే భార్య, కోడలు, మనవరాలితో కూడా వ్యభిచారం చేయిస్తానని పూర్ణచంద్రరావును వడ్డీ వ్యాపారులు బెదిరించారు. వేధింపులు ఎక్కువ కావడంతో దంపతులిద్దరూ తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు. పది పేజీల సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు లేఖను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 
ఈ కేసులో పోలీసుల ప్రమేయం ఉందని కూడా అనుమానాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఒక వ్యక్తి తాను డీఎస్పీ కుమారుడినంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబ సభ్యులు వడ్డీ వ్యాపారులు పోలీసుల పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడినట్లు చెబుతున్నారు. పోలీసులు నలుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేయగా సూసైడ్ నోట్ ను మాత్రం రహస్యంగా ఉంచారు. ప్రభుత్వం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: