చంద్రబాబు నెత్తిన ఊహించని పిడుగు  ?

Vijaya
చంద్రబాబునాయుడు ఊహించని రీతిలో జగన్మోహన్ రెడ్డి పెద్ద దెబ్బ కొట్టారు.  అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజున జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన అలాగే అనిపిస్తోంది.  వైసిపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాజధాని  అమరావతి నిర్మాణంపై పెద్ద ఎత్తున స్పెక్యులేషన్ నడుస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. దీని ఆధారంగా చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లోమీడియా కూడా జగన్ కు వ్యతిరేకంగా కథనాలు వండి వారుస్తోంది.

సరే కారణాలు ఏవైనా మొత్తంమీద జగన్  అసెంబ్లీలో చేసిన ప్రకటనతో చంద్రబాబునాయుడు నెత్తిన పిడుగు పడినట్లే ఉంది. జగన్ ప్రకటన ఒక్క చంద్రబాబుకే కాదు ఆయన సామాజికవర్గంతో పాటు ఎల్లోమీడియా నెత్తిన పిడుగుపడినట్లుగా అయిపోయింది.

అమరావతిని రాజధానిగా చంద్రబాబు ప్రకటించిన నేపధ్యం అందరికీ తెలిసిందే. కమ్మోరు లేకపోతే చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు అదీ కాకపోతే టిడిపిలోని కీలక నేతలు ముందుగానే  పెద్దఎత్తున భూములు కొనేసిన తర్వాతే రాజధాని ప్రకటన జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వ లెక్కల ప్రకారమే చంద్రబాబు అండ్ కో సుమారుగా 4700 ఎకరాలను కొనేశారు.

అంటే ఎంత లేదన్నా వేల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు కోటరీ ఇక్కడ భూములు కొనేసింది. మొన్నటి ఎన్నికల్లో కూడా మళ్ళీ చంద్రబాబే సిఎం అయ్యుంటే ఇపుడు పరిస్ధితులు ఎలాగుండేదో చెప్పలేం. వాళ్ళ ఖర్మ కాలిపోయి టిడిపి చిత్తుగా ఓడిపోవటమే కాకుండా జగన్ అఖండ మెజారిటితో గెలిచారు. అప్పటి నుండి చంద్రబాబు సామాజికవర్గానికి సమస్యలు మొదలయ్యాయి.

జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రియల్ఎస్టేట్ దారుణంగా పడిపోయిందని చంద్రబాబే చాలాసార్లు మొత్తుకున్నారు. ఈ నేపధ్యంలో ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం, జ్యుడిషియల్ రాజధానిగా కర్నూలు, అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా అమరావతి ఉంటుందని జగన్ చేసిన తాజా ప్రకటనతో  చంద్రబాబు సామాజికవర్గంతో పాటు జగన్ వ్యతిరేకులు మండిపోతున్నారు. జగన్ నుండి ఇటువంటి ప్రకటన వస్తుందని చంద్రబాబు అండ్ కో ఏమాత్రం ఊహించినట్లు లేదు. అందుకనే జగన్ ప్రకటనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు రెడీ అయిపోతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: