రైతు భరోసాపై మాటల మంటలు !
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రైతు భరోసాపై జరిగిన చర్చ.. రుణమాఫీ మీదకు మళ్లింది. మీరు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ.. టీడీపీ, వైసీపీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. రుణమాఫీ హామీని ఇప్పటికైనా నెరవేర్చాలని చంద్రబాబు చెబితే.. ఇదెక్కడి సంప్రదాయమని ఆర్థిక మంత్రి బుగ్గన కౌంటరిచ్చారు. అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తామని సీఎం జగన్ ప్రకటన చేశారు.
రైతు భరోసా పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజల చెవిలో పూలు పెడుతోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. మ్యానిఫెస్టోలో 12,500 రూపాయలు ఏటా ఇస్తామని చెప్పి.. ఇప్పుడు కేంద్ర పథకాన్ని మినహాయించి.. 7,500 ఇస్తున్నారని ఆరోపించారు. మాట తప్పమని చెప్పి.. మడమ తిప్పారని విమర్శించారు చంద్రబాబు. రుణమాఫీని చిత్తశుద్ధితో అమలు చేశామని చెప్పిన చంద్రబాబు.. ఈ ప్రభుత్వం మిగిలిన రెండు విడతలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తమ పథకానికి తమ బడ్జెట్లోనే నిధులు కేటాయించని ప్రభుత్వం టీడీపీ సర్కారని సెటైర్లేశారు ఆర్థిక మంత్రి బుగ్గన. 2014 ఎన్నికల్లో బంగారంపై తీసుకున్న రుణాలు కూడా మాఫీ చేస్తానని చంద్రబాబు.. ఏనాడూ మాట నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. వైసీపీ సర్కారుకు చెడ్డపేరు రాకూడదని సెటైరికల్ గా చెప్పారు చంద్రబాబు. మాట తప్పం. మడమ తిప్పం అని చెప్పిన విధంగా.. రైతులకు ఏటా 12,500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రతిపక్ష నేత.
కుక్కతోక వంకర అన్న సామెత చంద్రబాబుకు అతికినట్టు సరిపోతుందని మండిపడ్డారు జగన్. మంత్రుల ప్రకటనకు, వాస్తవ పరిస్థితికి పొంతన లేదని సభలో ప్రస్తావించారు చంద్రబాబు. ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధరకు, వాస్తవంగా కొంటున్న ధరకు సంబంధం లేదని ఆరోపించారు. రెండు రోజుల్లోనే అన్ని పంటలకు మద్దతు ధరలు చెబుతూ.. మీడియాలో బహిరంగ ప్రకటన ఇస్తామని జగన్ సభలో చెప్పారు. మద్దతు ధర కంటే తక్కువగా ఎవరూ అమ్మొద్దని, ఒకవేళ ధర రాకపోతే ఎక్కడకు వెళ్లి అమ్ముకోవాలో కూడా చెబుతామని జగన్ తెలిపారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాల లబ్ధిదారుల అసలు అంచనా, సవరించిన గణాంకాల మీద కూడా వాదోపవాదాలు జరిగాయి.