ఢిల్లీలో ఘోర అవమానం

Vijaya
జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో అవమానం జరిగింది. ఢిల్లీకి పిలిచి మరీ అవమానించటం వరుసగా ఇది రెండోసారి. ముందు అపాయిట్మెంట్ ఇచ్చి కలవటానికి జగన్ ఢిల్లీకి వచ్చిన తర్వాత కలవటానికి కుదరదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కార్యాలయం అధికారులతో జగన్ కు చెప్పించారు. జగన్ విషయంలో అమిత్ ఇలా ఎందుకు చేస్తున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు.

గురువారం రాత్రి 10.30 గంటల తర్వాత జగన్ తనను కలవచ్చని అమిత్ అపాయిట్మెంట్ ఇచ్చారు. ఇదే విషయాన్ని పార్టీ ఎంపిలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి మధ్యాహ్నం చెప్పటంతోనే జగన్ హడావుడిగా విజయవాడ నుండి ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ముందుగా అనుకున్నట్లుగా అమిత్ కార్యాలయం నుండి పిలుపు రాలేదు. ఎంపిలు, సిఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఎంత ప్రయత్నించినా షాను కలవటం సాధ్యం కాలేదు.

అర్ధరాత్రి తర్వాత  శుక్రవారం ఉదయం కలిసే అవకాశం ఉందని సమాచారం ఇచ్చారు. దాంతో చేసేది లేక శుక్రవారం అంతా ఎదురు చూశారు. ఇంతలో గురువారం తన వ్యక్తిగత సహాయకుడు నారాయణ మరణించారని సమాచారం అందింది. అందుకనే శుక్రవారం మధ్యాహ్నం వరకూ ఎదురుచూసిన జగన్ విసిగిపోయి మధ్యాహ్నంపైన ఢిల్లీ నుండి బయలుదేరి వచ్చేశారు.

ముందుగా అపాయిట్మెంట్ తీసుకోకుండా అమిత్ షాను కలవాలని అనుకుంటే అది సిఎం తప్పు. కానీ అడిగినపుడు అపాయిట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కలవటానికి ఇష్టపడకపోతే అది ముమ్మాటికి అమిత్ షా తప్పే. అంటే ఇక్కడ మ్యాట్ర వెరీ క్లియర్. జగన్ ను ఉద్దేశ్యపూర్వకంగానే అమిత్ అవమానిస్తున్నారు. ఎందుకంటే అక్టోబర్ 21వ తేదీన కూడా ఇలాగే అపాయిట్మెంట్ ఇచ్చి తర్వాత కలవటానికి ఇష్టపడలేదు.

గతంలో చంద్రబాబుకు కూడా ప్రధానమంత్రి ఇలాగే చేశారు. అయితే అప్పట్లో అపాయిట్మెంట్ తీసుకోకుండానే ఢిల్లీకి వచ్చేవారు కాబట్టి నరేంద్రమోడి కలవలేదని సరిపెట్టుకోవచ్చు. కానీ ఇపుడలా కాదు. రమ్మని చెప్పి జగన్ వచ్చిన తర్వాత కలవటం కుదరదని అంటున్నారంటే అవమానించటం తప్ప మరోటి కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: