దిశ : కుటుంబానికి ప్రభుత్వం సాయం చేయాలంటున్న నెటిజెన్లు ?
దిశ హత్యకు కారణమైన నలుగురు నిందితులను ఈరోజు తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. నవంబర్ నెల 27వ తేదీన అత్యాచారం చేసి ఆ తరువాత నిందితులు దిశను కాల్చి చంపారు. బహిరంగంగా ఉరి తీయాలని లేదా నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని ప్రజల నుండి డిమాండ్లు వినిపించాయి. దిశను హత్య చేసిన ప్రదేశంలోనే నిందితులు ఎన్ కౌంటర్ కు గురయ్యారు.
పోలీసులు దిశ హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేసే సమయంలో నిందితులు పోలీసుల దగ్గర ఉన్న ఆయుధాలు తీసుకొని పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపారు. దిశ హత్యకు కారణమైన నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన నేపథ్యంలో దిశ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. నిందితులను ఇంత త్వరగా శిక్షించినందుకు సంతోషంగా ఉందని చెప్పారు.
సమాజానికి, ప్రభుత్వానికి, మీడియాకు దిశ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నెటిజెన్లు ప్రభుత్వం దిశ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం దిశ కుటుంబానికి తగిన సాయం అందించాలని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు. గతంలో నిర్భయ కుటుంబానికి ఢిల్లీ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడంతో పాటు మృతురాలి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిందని సమాచారం. దిశ విషయంలో కూడా ప్రభుత్వం అదే విధంగా న్యాయం చేయాలని నెటిజెన్లు కోరుతున్నారు.
నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై ప్రముఖులు స్పందిస్తున్నారు. జూనియర్ ఎన్టీయార్ దిశకు న్యాయం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. సీపీఐ నేత నారాయణ నిందితులను ఎన్ కౌంటర్ చేయడం సమర్థనీయమే అని చెప్పారు. దిశ హత్య కేసు నిందితుల ఎన్ కౌంటర్ ను సీపీ సజ్జనార్ ధ్రువీకరించారు. దిశ తల్లిదండ్రులు పోలీసులు ఘటన జరిగిన 10 రోజుల్లోనే మంచి నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. దిశ ఆత్మకు ఎన్ కౌంటర్ తో శాంతి చేకూరుతుందని వ్యాఖ్యలు చేశారు.