ఉరితీస్తాం సరే..! తలారీ ఎక్కడ?

NAGARJUNA NAKKA

ఉరి తీయాల్సిందే... ఆడవాళ్లపై లైంగిక దాడిచేసిన దుర్మార్గులను వెంటనే అంతం చేయాల్సిందే... అనే నినాదాలు గట్టిగా వినపడుతున్నాయి. కానీ ఉరి తీయాలంటే  జైళ్లలో తలారులు లేరు. ఏడేళ్ల నాటి నిర్భయ నేరస్తుల క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి పరిధిలో ఉంది. రాష్ట్రపతి తిరస్కరిస్తే వెంటనే ఉరి తీయాల్సి ఉంటుంది. దీంతో.. తలారీ కోసం తీహార్ అధికారులు వెతుకుతున్నారు. 

 

నిర్భయ కేసులో అత్యంత పాశవికంగా దాడి చేసిన హత్య చేసిన నిందితులకు ఢిల్లీ హైకోర్టు ఉరి శిక్ష విధించింది. దీనిపై వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్థానం కూడా నిందితులకు ఉరే సరైందని ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్ధించింది. దీంతో దోషులు తమకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ రాష్ట్రపతికి విన్నవించారు. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రపతి పరిధిలో ఉంది.

 

అయితే ఇప్పుడు, దిశ ఉదంతంతో నిర్బయ దోషులకు తక్షణమే ఉరిశిక్ష అమలుచేయాలనే డిమాండ్ వినబడుతోంది. ఈ నేపథ్యంలో తీహార్ జైల్లో ఉన్న దోషులకు ఉన్న ఫళంగా ఉరిశిక్ష అమలు చేయలంటే ఎలా అని జైలు అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఉరితీసే వ్యక్తి లేకపోవడమే దీనికి కారణం. మరో నెల రోజుల్లో దోషులకు ఉరిశిక్ష అమలుచేసే అవకాశం ఉందనే వార్తలున్నాయి. దీంతో వివిధ ఆప్షన్లను అధికారులు పరిశీలిస్తున్నారు. కోర్టు బ్లాక్ వారెంట్ జారీచేసిన తర్వాత ఏ క్షణమైనా వారిని ఉరితీస్తారు. దోషుల క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి తిరస్కరించిన వెంటనే ఈ వారెంట్ ను కోర్టు జారీచేయనుంది. 

 

చివరిసారిగా పార్లమెంట్ పై దాడికేసులో దోషిగా తేలిని అఫ్జల్ గురును ఉరితీశారు. అయితే, ఆఫ్జల్ గురును ఉరితీసేటప్పుడు చివరి నిమిషంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకోవడంతో తిహార్ జైలు అధికారులే లీవర్ను లాగినట్టు వార్తలొచ్చాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, తీహార్ జైలు అధికారులు ఉరి లాగే వ్యక్తి కోసం అనధికారికంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, హర్యానా రాష్ట్రాల్లో ఎవరైనా మాజీ తలారులు ఉన్నారా? అనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే తలారీ ఉంటే చెప్పాలని ఆయా రాష్ట్రాల జైళ్ళ శాఖకు తీహార్ జైలు అధికారులు అభ్యర్ధన పంపించారు.

 

దేశంలో ఉరిశిక్షలు అమలుచేయకపోవడంతో ఉరితీసేవారిని జైల్లో నియమించలేదని, ఇప్పుడు అవసరం రావడంతో కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించాలని భావిస్తున్నారు. అత్యంత అరుదైన కేసుల్లో తప్ప ఉరిశిక్ష విధించకపోవడంతో పూర్తిస్థాయిలో తలారీని నియమించే అవసరం ఏర్పడలేదు.. అంతేకాదు, ఈ విభాగంలో పూర్తిస్థాయి ఉద్యోగి ఎంపిక కూడా ఎంతో కష్టమైందని కూడా భావిస్తున్నారు. మరోపక్క నిర్భయ కేసులో దోషిగా తేలిన వినయ్ శర్మ కారుణ్య మరణానికి పిటిషన్ దాఖలు చేశారు. అయితే అతడి పిటిషన్ను ఢిల్లీ సర్కార్ తిరస్కరించింది. మెర్సీ కిల్లింగ్ కోసం రాష్ట్రపతికి వినయ్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ ను  పరిశీలించిన ఢిల్లీ హోం మంత్రి సత్యేంద్ర జైన్.. ఆ పిటిషన్ ను తిరస్కరించాలని లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ను కోరారు. మిగతా దోషులు ముఖేశ్, పవన్, అక్షయ్‌ మాత్రం రాష్ట్రపతికి పిటిషన్ దాఖలు చేయకపోవడంతో వారికి వారం రోజులు గడువు ఇచ్చారు. నిర్భయ కేసులో శర్మ, ముకేశ్, పవన్, అక్షయ్, రామ్ సింగ్, ఓ మైనర్ బాలుడు నిందితులు కాగా, మైనర్ బాలుడు విడుదలయ్యాడు. రామ్ సింగ్ జైల్లోనే ఉరేసుకుని చనిపోయాడు. మిగిలిన నలుగురినీ ఉరితీయాల్సి వుంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: