శబరిమల విషయంలో చేతులెత్తేసిన కేరళ ప్రభుత్వం !

NAGARJUNA NAKKA
శబరిమల విషయంలో కేరళ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆలయ దర్శనానికి వచ్చే మహిళలకు ప్రత్యేక రక్షణ కల్పించలేమని తేల్చి చెప్పింది. వ్యక్తిగత రాజకీయాల కోసం శబరిమల ఆలయాన్ని వాడుకోవద్దని సూచించింది. రేపటి నుంచి ఆలయ ద్వారాలు తెరుచుకోనుండటంతో.. సెక్యూరిటీ కట్టుదిట్టం చేసింది ప్రభుత్వం.


శనివారం శబరిమల ఆలయం తెరుచుకోనుంది. మహిళల ప్రవేశం అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. రేపట్నుంచి అయ్యప్ప దర్శనానికి మహిళలకు అనుమతిస్తారా?..లేదా..? అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. దీంతో ఈ వ్యవహారంపై స్పష్టత ఇచ్చింది కేరళ ప్రభుత్వం. శబరిమల అయ్యప్పను దర్శించుకునే మహిళలకు రక్షణ కల్పించలేమని తెల్పింది. ఎవరైనా శబరిమల ఆలయాన్ని సందర్శించాలనుకుంటే  సుప్రీం కోర్టు ఆర్డర్‌ తీర్పుతో రావాలని సూచించింది. ఆందోళనలకు శబరిమల ఆలయం వేదిక కాదని తెల్పింది. ఆలయ ప్రాంగణంలో శాంతియు వాతావరణం నెలకొనేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పింది.


మహిళల ఆలయ ప్రవేశంపై స్పందించిన కేరళ దేవాదాయశాఖ మంత్రి..కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు మహిళలు పబ్లిసిటీ కోసం ఆలయానికి వస్తున్నారని హాట్ కామెంట్లు చేశారు. యాక్టివిజం ప్రదర్శించడానికి శబరిమలను ఉపయోగించుకోవద్దని సూచించారు. కొందరు ప్రెస్‌మీట్ లు పెట్టి మరీ ఆలయదర్శనానికి వస్తున్నారని, ఇదంతా పబ్లిసిటీ కోసమేనని అన్నారు. 


శబరిమల ఆలయంలో మహిళలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ గతేడాది సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అన్ని వయస్సులవారు ఆలయాన్ని సందర్శించొచ్చని తెల్పింది. దీంతో భూమాతా బిగ్రేడ్ కార్యకర్త తృప్తిదేశాయ్‌ సహా కొందరు మహిళా సంఘాలు ఆలయ ప్రవేశానికి ప్రయత్నించాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీస్ ఎస్కార్ట్‌ మధ్య ఇద్దరు మహిళలు ఆలయ ప్రవేశం చేశారు. కేరళ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే మహిళలకు ముసుగువేసి మరీ ఆలయంలోకి తీసుకెళ్లారని హిందూ సంఘాలు ఆరోపించాయి. ఇది పెద్ద దుమారం రేగడం.. సుప్రీం కోర్టు విస్తృత ధర్మాసనానికి కేసును అప్పగించడంతో కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: