రాఫెల్ వివాదంలో జేపీసీ విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టు కేంద్రానికి క్లీన్ చిట్ ఇవ్వలేదని, కాంట్రాక్టుల్లో అవినీతిపై విచారణకు కోర్టులు సరైన వేదిక కాదనే చెప్పిందని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుతో రాఫెల్ పై జేపీసీ విచారణకు బాటలు పడ్డాయనీ, కాంగ్రెస్ ప్రశ్నలకు కేంద్రం ఇంతవరకూ జవాబు చెప్పలేదని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
దేశవ్యాప్తంగా కలకలం రేపిన రాఫెల్ వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో బీజేపీ నేతలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో అర్థం కావడం లేదని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. రాఫెల్ విషయంలో తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు.. జేపీసీ విచారణకు బాటలు పరిచిందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కేంద్రం ఇప్పటికైనా కళ్లు తెరిచి జేపీసీ వేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ మరోసారి దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని కాంగ్రెస్ విరుచుకుపడింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 32 ప్రకారం కోర్టులకు విచారణ పరిధి కొంతవరకే ఉంటుందన్న సంగతి సుప్రీం చెప్పిందని గుర్తుచేసింది. కాంట్రాక్టుల్లో అవినీతి, ఒకేసారి ధరల పెరుగుదల వంటి వాటిపై విచారణకు కోర్టులు సరైన వేదిక కాదన్న కాంగ్రెస్.. వెంటనే జేపీసీ వేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. జేపీసీతోనే నిజానిజాలు నిగ్గుతేలతాయని ప్రకటించింది.
కాంగ్రెస్ గతంలో అడిగిన తొమ్మిది ప్రశ్నలకు కేంద్రం ఇంతవరకూ జవాబు చెప్పలేదని ఆ పార్టీ గుర్తు చేసింది. రాఫెల్ కాంట్రాక్టు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కు ఎందుకివ్వలేదు, కేవలం పన్నెండు రోజుల అనుభవం ఉన్న కంపెనీకి రూ.30 వేల కోట్ల విలువైన కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారనేది తేలాలంది. ఒక్కసారిగా రాఫెల్ ధర రూ.526 కోట్ల నుంచి రూ.1670 కోట్లకు ఎలా పెరిగిందని నిలదీసింది. యుద్ధ విమానాల సంఖ్యను 126 నుంచి 36కి ఎందుకు తగ్గించారని, డిఫెన్స్ ప్రొక్యూర్ మెంట్ కౌన్సిల్, భద్రతావ్యవహారాల క్యాబినెట్ కమిటీని ప్రధాని ఎందుకు బైపాస్ చేశారని ప్రశ్నించింది. రాఫెల్ టెక్నాలజీ ఇండియాకు బదిలీ చేయాలన్న నిబంధన ఎందుకు తీసేశారనీ, రాఫెల్ అప్పగింతకు ఎనిమిదేళ్ల గడువు ఎందుకని కూడా కాంగ్రెస్ గతంలో ప్రశ్నించింది. మోడీ రాఫెల్ బెంచ్ మార్క్ ధరను 5.2 బిలియన్ యూరోల నుంచి 8.2 బిలియన్ యూరోలకి ఎందుకు పెంచారని, సార్వభౌమ గ్యారెంటీ నిబందనను ఎందుకు సవరిరంచారో జవాబు చెప్పాలని నిలదీసింది కాంగ్రెస్.