ఈ విషయంలో ఉక్కుమహిళ ఇందిర చేతిలో, నరెంద్ర మోడీ వెనకబడ్డట్టే?

భారత దేశంలో ఏదైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజాప్రభుత్వాన్ని సస్పెండు చేసి లేదా రద్దుచేసి, నేరుగా కేంద్ర ప్రభుత్వపాలనలోకి తీసుకురావడాన్ని రాష్ట్రపతి పాలన అంటారు.  భారత రాజ్యాంగం లోని 356వ అధికరణం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఈ అధికారం సంక్రమించింది. దీని ప్రకారం, రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందిందని భావించినపుడు, దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలనను విధించవచ్చు.


ఏదైనా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తినపుడు, పౌర ఆందోళనలు జరిగినపుడు రాష్ట్రప్రభుత్వం అదుపు చెయ్యలేకపోతే, దేశ ఐక్యతను, సమగ్రతనూ కాపాడేందుకు 356 అధికరణం కేంద్ర ప్రభుత్వానికి అనేక అధికారాల నిచ్చింది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న వివిధ పార్టీలు తరచూ ఈ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వచ్చాయి.ఈ అధికారాలను ఉపయోగించి, తమ ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను తొలగించాయి అందుచేత దీన్ని సమాఖ్య వ్యవస్థకు ముప్పుగా అనేకులు పరిగణించారు. 

1950 లో రాజ్యాంగాన్ని ప్రవేశ పెట్టాక, రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వాలు  ఈ అధికరణాన్ని పలు మార్లు ఉపయోగించింది.  1954 లో ఉత్తర ప్రదేశ్‌లో మొదటిసారిగా ఈ అధికరణాన్ని ప్రయోగించారు. 1970, 1980 లలో, దీన్ని ఉపయోగించడం మామూలై పోయింది.ఇందిరా గాంధీ ప్రభుత్వం, జనతా పార్టీ ప్రభుత్వం ఇందుకు బాధ్యులు. 1966, 1977 మధ్య ఇందిరా గాంధీ 39 సార్లు ఈ అధికరణాన్ని ప్రయోగించగా, జనతా పార్టీ తన రెండున్నరేళ్ళ పాలనలో 9 సార్లు ప్రయోగించింది.


ఎస్సార్ బొమ్మై కేసులో సుప్రీమ్‌ కోర్టు 1994 లో ఇచ్చిన తీర్పులో రాష్ట్రపతి పాలన విధింపుపై నియంత్రణలు విధించిన తర్వాత మాత్రమే ఇది తగ్గింది. 2000 తర్వాత రాష్ట్రపతి పాలన విధింపు బాగా తగ్గిపోయింది. భారత సమాఖ్య వ్యవస్థపై జరిగే చర్చలో 356 అధికరణం ఎప్పుడూ ఒక ముఖ్య అంశమే కేంద్ర రాష్ట్ర సంబంధాలపై 1983 లో సర్కారియా కమిషను ఇచ్చిన నివేదికలో 356 అధికరణాన్ని "తక్కువగా, అత్యంత తీవ్రమైన సందర్భాల్లో మాత్రమే, రాజ్యంగ వ్యవస్థలను పునః ప్రతిస్థాపించేందుకు అవసరమైన అన్ని ప్రజాస్వామ్య యుత ప్రయత్నాలు చేశక చిట్టచివరి ప్రత్యామ్నాయంగా మాత్రమే ప్రయోగించాలి” అని పేర్కొంది

• రాష్ట్రపతి పాలన విధించినపుడు రాష్ట్ర శాసనసభను రద్దు చేయవచ్చు లేదా తాత్కలికంగా సుప్త చేతన స్థితిలో ఉంచవచ్చు.
• రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శాసనసభలో తగినంత ఆధిక్యత ఏ పార్టీకి గాని, కూటమికి గాని లేకపోయినపుడు కూడా రాష్ట్రపతి పాలనను విధించవచ్చు. రాజ్యాంగం ప్రకారం శాసనసభ సమావేశాల ముగింపుకు, తదుపరి సమావేశాల మొదలుకూ మధ్య 6 నెలలకు మించి అంతరం ఉండరాదు.
• రాష్ట్రపతి పాలన 6 నెలలకు మించి విధించరాదు. అయితే 6 నెలల వ్యవధి తరువాత మరో 6 నెలల కాలానికి పొడిగించవచ్చు. ఈ విధంగా ఎన్నిసార్లైనా పొడిగించవచ్చు.
• రాష్ట్రపతి పాలనలో రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన ఏ అధికారాన్ని రద్దు చేసే అధికారం మాత్రం రాష్ట్రపతికి లేదు.
• రాష్ట్రపతి పాలన విధింపును పార్లమెంటు నిర్ధారించాలి.
 

రాష్ట్రంలోని పరిస్థితిపై గవర్నరు ఇచ్చిన నివేదికపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రపతి పాలన అమల్లో ఉండగా, రాష్ట్రపతి ప్రతినిధిగా రాష్ట్ర గవర్నరు పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ బాధ్యతల్లో భాగంగా గవర్నరు తనకు సహాయపడేందుకు అధికారులను నియమించుకోవచ్చు. 356 అధికరణ ప్రయోగాన్ని ప్రజాస్వామ్య వాదులు సహజంగా సహించరు. రాష్ట్రపతి పాలనకు ఆస్కారమిచ్చే 356 అధికరణ ప్రయోగం అంటే ఆయా రాష్ట్రాల ప్రజలు కొంత అసంతృప్తి కి గురౌతావుతారు. కారణం తాము ఎన్నుకున్న స్థానిక ప్రభుత్వాలను అధికారంనుంచి దించేసి, కేంద్రం సాగించే పాలనను వారు ప్రజాస్వామ్యంగా గుర్తించకపోవటమే.


ఇప్పుడు మహారాష్ట్ర లో నెలకొన్న రాజకీయ ప్రతిష్ఠంభన నేపథ్యంలో అక్కడ కూడా రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో అసలు దేశం లో ఎన్నిసార్లు ఆర్టికల్ 356 అధికరణప్రయోగంజరిగింది? ఏ  ప్రధాని ఎన్ని సార్లు ఈ ఆయుధాన్ని ఉపయోగించారు? ఏ పార్టీ ప్రభుత్వాలు ఇలా రాష్ట్రాల అధికారాలను దుర్వినియోగం చేశారు లేదా కోతకు ఉపక్రమించారు? ఆయా విషయాలు నిజంగానే ఆసక్తి కలిగిస్తాయి కదా!


ఆర్టికల్ 356 ప్రయోగానికి సంబంధించి, స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు నూట ఇరవై ఐదు సార్లకు పైగా వివిధ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన అమలైంది. రాష్ట్రపతి పాలన పేరుతో రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చెలాయించటం జరిగింది - ఎవరెవరు ఈ అస్త్రాన్ని ఎక్కువగా ప్రయోగించారన్న విషయం కూడా ఆసక్తి కరమైన విషయం.  


*ఇక భారత తొలి ప్రదాని జవహర్ లాల్ నెహ్రూ ప్రజాస్వామ్య ప్రేమికుడు ఈ రాష్ట్రపతి పాలన అస్త్రాన్ని 8 సార్లు ప్రయోగించారు. 
*ఉక్కు మహిళగా పేరొందిన కాంగ్రెస్ పార్టీ మహిళా అధినేత్రి శ్రీమతి ఇందిరా గాందీ ఏకంగా 35 సార్లు ఈ అస్త్రాన్ని పలు రాష్ట్రాలపై ప్రయోగించారు. అంతేకాదు ఏకంగా దేశానికే “అత్యవసర పరిస్థితి” రుచి చూపించిన ఏకైక భారత నాయకురాలు ఆమె. 
*ఇక ఇందిర పార్టీకి అంటే కాంగ్రెస్ కే చెందిన ప్రధాని పీవీ నరసింహా రావు 11 సార్లు ఈ అస్త్రాన్ని వివిధ ప్రయోగించారు. 
*ఇక ఆ తర్వాత ఈ అస్త్రాన్ని అంతగా బయటకు తీసినట్లే కనిపించిన మృదుస్వభావి రాజీవ్ గాంధీ కూడా 6 సార్లు వాడేశారు. 
*మౌనమునిగా ముద్రపడిన కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్ తన పదేళ్ల పాలనా కాలంలో ఏకంగా 12 సార్లు ఈ అస్త్రాన్ని ప్రయోగించారట.
*భారతం సగ్ర్వంగా కీర్తించిన ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, యుద్ధాల కారణంగా ఒక సారి 356 అధికరణం ప్రయోగించక తప్పలేదు. 
*ఇక  జనతా పార్టీ హయాంలో అప్పటి ప్రధాని మోరార్జీ దేశాయ్ కూడా ఏకంగా 16 సార్లు ఆర్టికల్ 356 అధికరణాస్త్రాన్ని ప్రయోగించారని సమాచారం.  
*కాంగ్రెసేతర ప్రధానులు చంద్రశేఖర్, ఐదు సార్లు, 
*చరణ్ సింగ్ 4 సార్లు, 
*వీపీ సింగ్ 2 సార్లు, 
* బీజేపి ప్రధాని అతి సౌమ్యుడు అటల్ బిహారీ వాజ్ పేయి 5 సార్లు, 
*ప్రధాని పదవిని నిద్రలోనే గడిపిన దేవేగౌడ ఒక్కసారి ఈ అస్త్రాన్ని ప్రయోగించారు. 
అయితే ప్రస్తుతం ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ, తన తొలి ఐదేళ్ల పాలనలో కేవలం రెండు సార్లు మాత్రమే ఆర్టికల్ 360 అధికరణం వినియోగించగా , ఇప్పుడు మహారాష్ట్ర లోనూ ఈ అస్త్రం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శాసనసభలో తగినంత ఆధిక్యత ఏ పార్టీకి గాని, కూటమికి గాని లేకపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో  రాష్ట్రపతి పాలనను విధించారు. అయితే శాసనసభను సుప్త చేతనావస్థలో ఉంచారు. అంటే ఎప్పుడైనా సుస్థిర రాజకీయ పరిస్థితులతో ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్రపతి పాలన తొలగిస్తామని దేశ హోం శాఖా మాత్యులు అమిత్ షా ప్రకటించారు. డీనితో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు 3 సార్లు మాత్రమే 356 అధికరణను ప్రయోగించినట్టైంది. 
ఈ లెక్కన దూకుడులో అన్నింటా ఇందిరతో పోటీపడే,  ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్టికల్ 360 ప్రయోగంలో మాత్రం కాస్త సౌమ్యంగానే అంటే ప్రజాస్వామ్యయుతం గానే వెళుతున్నట్లే కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: