దొంగతనాల్లో హాఫ్ సెంచరీ కొట్టిన కిలాడీ దొంగ

NAGARJUNA NAKKA

విలాసాలాకు అలవాటు పడి చోరీల బాటపట్టాడు. పోలీసులకు దొరికినప్పుడల్లా జైలుకెళ్లి.. కొత్త ఫ్రెండ్స్‌ను పోగేసుకున్నాడు. బయటకు రాగానే ఎంచక్కా మళ్లీ  దొంగతనాలకు పాల్పడుతుండేవాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా దొంగతనాల్లో హాఫ్ సెంచరీ కొట్టేశాడు. తాజాగా ఓ భారీ చోరీకి పాల్పడి ... సిక్కోలు పోలీసులకు పట్టుబడ్డాడో కిలాడీ దొంగ . 


శ్రీకాకుళం జిల్లాలో సంచలనం రేకెత్తించిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. గతనెల 12న శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన శ్రీనివాసరావు ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడ్డ దొంగలు 35 తులాల బంగారం, కిలో 2 వందల 50 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు 7 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ లను రంగంలోకి దించి కీలక ఆధారాలు సేకరించారు. చోరీ చేసిన తీరును బట్టి పాతనేరస్తుడని ఓ అంచనాకు వచ్చారు అధికారులు. ఆ దిశగా దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే చోరీల్లో ఆరితేరిన పొన్నాడ రవిశంకర్ అలియాస్ వీరబాబును సిక్కోలు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.


తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని జగన్నాధపురానికి చెందిన వీరబాబు 18 ఏళ్ల వయసులోనే చోరీలు చేయడం మొదలెట్టాడు. తూర్పుగోదావరి నుంచి మొదలెట్టిన రవిశంకర్ దాదాపు ఏపీలోని అన్ని జిల్లాలను ఓ చుట్టు చుట్టేశాడు. దాదాపు చోరీల్లో అర్ధసెంచరీ కొట్టేసిన రవిశంకర్‌ను పట్టుకున్న పోలీసులు అతని చోరీల స్టైల్ తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దొంగతనాలకు పాల్పడిన అనంతరం పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లే రవిశంకర్.. అక్కడ కొత్త దొంగలతో పరిచయాలు ఏర్పాటు చేసుకునేవాడు. శిక్ష పూర్తయి బయటికొచ్చిన తర్వాత జైలు మిత్రులతో కలిసి చోరీలకు పాల్పడేవాడు. 


చోరీకి ఏదైనా ఇల్లు టార్గెట్ చేస్తే పక్కాగా రెక్కీ వేసి మరీ ఆ ఇల్లు గుల్లచేసేవాడు శంకర్. ఎవరికీ దొరకకుండా ఉండేందుకు సెల్ ఫోన్ కూడా వాడకపోవడం అతని చోరకళకు నిదర్శనం. ఇక ఏ అవసరం ఉన్నా.. ఎవరో ఒకరి ఫోన్ తీసుకుని మాట్లాడి ఎస్కేప్ అవ్వడం అతని స్టైల్. తాజాగా రెండు నెలల క్రితమే జైలు నుంచి బయటికివచ్చిన రవిశంకర్ శ్రీకాకుళానికి చెందిన ముగిపల్లి రాజు, విజయనగరం జిల్లాకు చెందిన మూగు శ్రీనుతో కలిసి శ్రీకాకుళంలోని కత్తెరవీధిలో చోరీకి పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది.  


చోరీ డబ్బుతో హైదరాబాద్, షిర్డీ వంటి ప్రాంతాల్లో తిరిగి ఎంజాయ్ చేశారు. ఐతే పోలీసులు తమ కోసం వెతుకుతున్నారని తెలియడంతో తన దగ్గరున్న సొత్తును అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా వీరి ఆట కట్టించారు పోలీసులు. ఈ క్రమంలో ఈ ముగ్గురి నుంచి 275 గ్రాముల బంగారం, కిలో 250 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: