ఇంతకీ ఈ ఇసుక ఎవరిది ?

Vijaya

ఇపుడిదే ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది. లేకపోతే ఒకవైపు రాష్ట్రంలో చాలామంది ఇసుక సరఫరా కాక ఇబ్బందులు పడుతుంటే ఒక్క ఎల్ అండ్ టి దగ్గరే 80 వేల టన్నుల ఇసుక ఉండటమేంటి ? అసలు అన్ని వేల టన్నుల ఇసుక ఓ కంపెనీ దగ్గరే ఎలా పోగుపడింది ? ఆ కంపెనీ దగ్గర వేలాది టన్నుల ఇసుకుందని తెలుసుకున్న ప్రభుత్వం దాన్ని సీజ్ చేద్దామని ప్రయత్నిస్తే కోర్టు అడ్డుకోవటమేంటో అర్ధం కావటం లేదు.

 

ఎల్ అండ్ టి పేరుతో దాచిపెట్టిన వేలాది టన్నుల ఇసుకంతా తెలుగుదేశంపార్టీ నేతలదే అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఒక్కచోటే ఇన్ని వేల టన్నుల ఇసుకను దాచిపెట్టారంటే ఇంకా ఎక్కడెక్కడ దాచి పెట్టారో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాల వారీగా ప్రభుత్వం గనుక జాగ్రత్తగా విచారణ చేయిస్తే ఇంకా ప్రైవేటుగా ఇసుకను దాచిపెట్టుంటే అదంతా కూడా బయటపడుతుందనటంలో సందేహం లేదు.

 

నిజానికి చంద్రబాబునాయుడు హయాంలో  ఎల్ అండ్ టి సంస్ధ రెచ్చిపోయిన విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో జరిగిన తాత్కాలిక నిర్మాణాల్లో చాలా వరకూ పై సంస్ధే నిర్మించింది. సంస్ధకు సంబంధించి ఎక్కడో ఓ చోట నిర్మాణాలు జరుగుతునే ఉంటాయి కాబట్టే  భారీ ఎత్తున ఇసుకను నిల్వ చేసుకుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఏదేమైనా అన్ని వేల టన్నుల ఇసుకను నిల్వ చేసుకున్నదంటే మాత్రం కాస్త అనుమానించాల్సిందే.

 

గడచిన ఐదేళ్ళల్లో చాలామంది టిడిపి నేతలు ఇసుక అక్రమ రవాణాలోనే కోట్ల రూపాయలు సంపాదించుకున్నారంటూ వైసిపి ఎప్పటి నుండో ఆరోపణలు చేస్తోంది. దానికి తగ్గట్లే చాలామంది టిడిపి నేతలపై కొంతమంది టిడిపి నేతలు ఇసుక అక్రమ రవాణాపై ఆరోపణలు కూడా చేశారు. సో మొత్తం మీద చూస్తుంటే బయటపడిన ఎల్ అండ్ టి 80 వేల టన్నుల ఇసుకే కాదు ఇంకెన్ని వేల టన్నుల ఇసుక బయటపడుతుందో  చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: