పాలన అన్నాక ఎంత సేపూ హైవేపై వెళ్లే.. సూపర్ లగ్జరీ బస్సులాగా ఉండదు. అప్పుడప్పుడు గ్రామీణ గతు కు రోడ్లపై వెళ్లే పల్లెవెలుగు బస్సునూ తలపిస్తుంటుంది. అయితే... ఈ ఒడిదుడుకులు తట్టుకుని ముందు కు సాగినప్పుడే.. పరిస్థితి ఓకే అవడం, పాలనపై పట్టు రావడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం గడిచిన నాలుగు నెలలుగా రాష్ట్రంలో ఇసుక ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రభుత్వం మారిన వెంటనే అప్పటి వరకు ఉన్న ఇసుక పాలసీని రద్దు చేసిన జగన్.. సరికొత్తపాలసీకి రంగం సిద్ధం చేశారు.
అయితే, దీనికి సంబంధించి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి రావడం, ఇంతలోనే ఇసుక రీచ్‌లను బంద్ చేయడంతో సమస్య ప్రారంభమైంది. ఇక, కొత్త ఇసుక పాలసీ తెరమీదికి వచ్చినా కూడా.. ఆమోదం పొందేందుకు సమయం పట్టడం, ఇంతలోనే జగన్ అమెరికా పర్యటనకు వెళ్లిపోవడంతో ఎక్కడి పరిస్థితి అక్కడే అన్నట్టుగా మారిపోయింది. ఇక, ఈ పరిస్తి తి ఇలా ఉంటే.. ఎగువ రాష్ట్రాల్లో వెల్లువెత్తిన వర్షాల ధాటికి.. ప్రధాన నదులు పొంగి పొర్లాయి. దీంతో రాష్ట్రం లోని నదులకు కూడా వరదలు వచ్చాయి.
ఈ దెబ్బతో ఇసుక పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఫలితంగా నిర్మాణ రంగంపై ఆధారపడిన కార్మికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ఇటీవల వారం రోజులుగా వారిలో మనోధైర్యం కోల్పోయి మరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కార్మికుల పరిస్తితి ఇలా ఉంటే.. మరోపక్క, ఇళ్లు కట్టుకునే వారు కూడా ఇప్పుడు ఇబ్బందుల పాలయ్యే పరిస్థితి వస్తోంది.నిన్న మొన్నటి వరకు వర్షాకాలం వచ్చింది కనుక పరిస్థితి ఎలా ఉన్న గడిచి పోయింది. కానీ, ఇప్పుడు అత్యంత కీలకమైన కార్తీక మాసం సహా పుణ్యతిథులు ప్రారంభమయ్యాయి.
దీంతో కొత్తగా ఇళ్లు కట్టుకునేవారు .. ఇప్పుడు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో ఇసుక లభ్యత లేక పోవడంతో ప్రభుత్వంపై నలువైపులా విమర్శలు వచ్చేందుకు అవకాశం ఏర్పడింది. మరోపక్క, కార్మికుల్లో ఆత్మస్థయిర్యం కూడా లోపిస్తోంది. ఈ పరిణామాలను జగన్ యుద్ధ ప్రాతిపదికన ఎదుర్కొనాల్సిన, పరిష్కరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు పరిశీలకులు. ఇన్నాళ్లు ఆయన చేసిన సంక్షేమం, పాలనలో తన తరహా ప్రత్యేకతను నిలబెట్టుకోవాలంటే..ఖచ్చితంగా ప్రస్తుతం ముసురుకున్న ఇసుక తుఫాను నుంచి అత్యంత వేగంగా బయటపడాలని సూచిస్తున్నారు.