భాగ్యనగరంలో చెడ్డీ గ్యాంగ్ అలజడి.. తస్మాత్ జాగ్రత్త!
హైదరాబాద్‌లో మళ్లీ చెడ్డి గ్యాంగ్ రెచ్చిపోతోంది. గత కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న నగరంలో వరుస చోరీలతో అలజడి రేపింది చెడ్డి గ్యాంగ్. దీంతో శివారు ప్రాంతాల వాసుల్లో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. చెడ్డీ గ్యాంగ్ పేరు చెబితేనే హైదరాబాద్ శివారు ప్రాంతాల వారు హడలెత్తిపోతారు. ఈ గ్యాంగ్ కదలికలు ఉన్నాయనే సమాచారం అందిందంటే... పోలీసులకు కంటి మీద కునుకు ఉండదు. చెడ్డీ గ్యాంగ్‌లోని వాళ్లంతా గుజరాత్‌లోని దాహోడ్ ప్రాంతానికి చెందిన ఆదివాసీ తెగకు చెందిన వారు. వీళ్లు ఒంటిపై కేవలం బనియన్, డ్రాయర్‌తో మాత్రమే ధరించి చోరీలకు వెళ్తారు. చేతుల్లో ఇనుపరాడ్లు, కర్రలు వంటి ఆయుధాలు ఉంటాయి. తమ వెంట రాళ్లను కూడా తీసుకెళ్తారు. ఎవరైనా తమను గుర్తించి కేకలు వేసినా... పట్టుకునే ప్రయత్నం చేసినా... పాశవింకగా దాడి చేసి పరారవుతూ ఉంటారు చెడ్డీ గ్యాంగ్ సభ్యులు.
తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి పక్కాగా చోరీ చేయడం వీళ్లకు అలవాటు. ఇనుపరాడ్ల సహాయంతో కిటికీల గ్రిల్స్‌ను తొలగించడం, ఇంటికి వేసిన తాళం విరగ్గొట్టడంలో చెడ్డీగ్యాంగ్ సభ్యులు ఆరితేరినవాళ్లు. సీసీ కెమరాలకు దొరక్కుండా జాగ్రత్తగా దొంగతనాలు చేయడం వీరి మరో ప్రత్యేకత. ఒక్కో సారి ఇళ్లలోకి చొరబడి దోపిడీలు చేస్తుంటారు. ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదు ఇవ్వమంటారు... కాదు... కూడదంటే విచక్షణా రహితంగా దాడి చేసి, అందిన కాడికి దోచుకొని పోతారు.