వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి... కానీ ఆ ఘోరం జరిగిపోయింది.?
భాగ్యనగరం లో దొంగల బెడద రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇల్లు విడిచి బయటకు వెళితే చాలు ఇల్లు గుల్ల చేస్తున్నారు దొంగలు. ముందుగా భారీగా డబ్బులు ఉన్నాయని అనుకున్న వాళ్ల ఇళ్ళ దగ్గర రెక్కీ నిర్వహిస్తారు... ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్లటమే తడువు ఇల్లు గుల్ల చేస్తారు. దొంగతనం జరుగుతున్నట్లు ఎవ్వరికి తెలియకుండా అతి తెలివిగా దొంగతనాలకు పాల్పడుతున్నారు దొంగలు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఎన్నో చోట్ల దొంగలు బీభత్సం సృష్టించారు. తాజాగా మరో చోట దొంగలు వారి చేతివాటం చూపించి... అతి తెలివిగా దొంగతనం చేసారు.
హైదరాబాద్లోని బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ చేశారు దొంగలు. బాధితులు పనిపై బయటికి వెళ్లి వచ్చేసరికి... ఇంట్లో ఉన్న డబ్బు నగలు అందినకాడికి దోచుకుని పరారయ్యారు. ఇక బాధితులు ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉన్న డబ్బులు నగలు మాయమవడం తో లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పాత బోయిన్ పల్లి మల్లికార్జున నగర్ కు చెందిన సరళ అనే మహిళా వడ్డీ వ్యాపారం చేస్తుంటుంది. అయితే సోమవారంనాడు ఆమె బోయిన్ పల్లి వెళ్లి మళ్లీ ఇంటికి తిరిగి చేరుకుంది. కాగా ఇంటికి వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. తాళాలలు తెరిచి ఇంటిలోకి వెళ్ళింది ఆ మహిళ. ఇంట్లో ఉన్న డబ్బు నగలు మాయం కావడంతో షాక్ కి గురైన ఆమె చోరీ జరిగినట్లు గ్రహించింది.
దీంతో హుటాహుటిన పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఐదున్నర కిలోల బంగారు నగలు, ఏడు కిలోల వెండి, 18 లక్షల రూపాయల నగదు చోరీకి గురైనట్లు మహిళా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కాగా మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఇంటి దొంగలే చోరీ చేసి ఉంటారా లేక... బయట వాళ్ళు చోరీకి పాల్పడి ఉంటారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.