ఏపి : మెగా డీఎస్సికి మోక్షం దొరకదా.. ఎన్నేళ్లు ఈ నిరీక్షణ..?

murali krishna
ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సి అభ్యర్థుల పరిస్థితి మరీ అద్వానంగా తయారైంది.. ప్రభుత్వం మారిన పరిస్థితి మాత్రం మారడం లేదు.. ఆ నాయకుడు వస్తే ఇది చేస్తాడు.. ఈ నాయకుడు వస్తే అది చేస్తాడు..అని ప్రతి నాయకుడిని నమ్మి డీఎస్సి అభ్యర్థులు మోసపోతున్నారు.. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష ‘డీఎస్సి’ జరిగి ఆరేళ్లు గడిచిపోయింది..గత 2018 డీఎస్సి లో ఉద్యోగం రాని అభ్యర్థులు అప్పటి నుంచి ఇంటిని, వున్న ఊరిని వదిలేసి కోచింగ్ సెంటర్లకే పరిమితం అయ్యారు.. ఏ నాటికైనా నోటిఫికేషన్ రాకపోతుందా ఉద్యోగం సాధించకపోతామా అని నిరంతరం పుస్తకాలపై కుస్తీ పడుతున్నారు. ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలంటే టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు కాస్త అదృష్టం కూడా ఉండాలని నేటి ప్రభుత్వాలు నిరూపిస్తున్నాయి..అధికారంలోకి రావడానికి డీఎస్సి అంశాన్ని ఒక పావులాగా వాడుకొని అధికారంలోకి రాగానే దాని ఊసే ఎత్తని నాయకులు వున్నంత కాలం రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించడం ఒక కల అని చెప్పాలి..
రాజకీయ లబ్ది కోసం మాత్రమే ఆలోచించే రాజకీయ నాయకులు ఉన్నంత కాలం రాష్ట్రంలోని నిరుద్యోగులు.. నిరుద్యోగులుగానే మిగిలిపోతారు..గత ప్రభుత్వం చేసిన దారుణమైన మోసం మరువక ముందే కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం సైతం అలాంటి అడుగులే వేస్తుంటే డీఎస్సి అభ్యర్థులు వారి మనోవేదన ఎవరికీ చెప్పుకోవాలో తెలీక కుమిలిపోతున్నారు.. చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగాలు సైతం మానేసి ఉపాధ్యాయ ఉద్యోగం కోసమే అప్పు చేసి మరీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎందరో వున్నారు.. వాళ్ళ బాధ చెప్పుకోలేనిది..ఏకంగా 16,347 పోస్టులకు డీఎస్సి ఇస్తున్నాం అని మొదటి సంతకం చేసిన కూటమి ప్రభుత్వం..అమలులో మాత్రం చిత్తశుద్ధి చూపించడం లేదు..కొత్తగా వచ్చిన అభ్యర్థుల కోసం టెట్ నిర్వహించారు కానీ అసలు నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి ఎక్కడా లేని కుంటి సాకులు తెరపైకి తెస్తున్నారు.
ఎట్టి పరిస్థితులలో డిసెంబర్ నాటికీ పరీక్షలు జరుపుతామని ఊదరగొట్టిన కూటమి ప్రభుత్వం తీరా నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి ఎస్సి వర్గీకరణ అంటూ మరో నాటకానికి తెరలేపింది.. దీనితో అభ్యర్థులు మళ్ళీ మోసపోయామని తల బాదుకుంటున్నారు…ఈ డీఎస్సి పరిస్థితి ఇంతేనా ఇంత కంటే ముందుకు కదలదా అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.. మా గోడు పట్టించుకోండి అంటూ వినతి పత్రాలను సంబంధిత నాయకులకు అందజేస్తూనే వున్నారు.. దయచేసి మా బాధ అర్ధం చేసుకోండి.. మాకు నోటిఫికేషన్ ఇవ్వండి అంటూ అభ్యర్థులు ప్రాధేయ పడుతున్నారు..మరి అభ్యర్థుల గోడు ప్రభుత్వం పట్టించుకుంటుందా..?వయోపరిమితి ముగుస్తున్న అభ్యర్థులకు న్యాయం జరుగుతుందా..?అనేది ప్రభుత్వం నిర్ణయం పై ఆధారపడి వుంది.. ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూడడమే తప్ప చేసేది ఏమి లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: