పాలపొంగు కాదు ప్రజాదరణ: లగడపాటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫైర్

 హైదరాబాద్: ఉప ఎన్నికల ఫలితాలను పాలపొంగుతో పోల్చిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంబటి రాంబాబు, సోమయాజులు మండిపడ్డారు. ప్రజలు ఇచ్చిన తీర్పును రాజగోపాల్ అవహేళన చేసే విధంగా మాట్లాడటం తగదని వారు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ హితవు పలికారు. ఎన్నికలకు నెల రోజులుగా ముందుగానే రాష్ట్రానికి చెందిన ఓ చానెల్, జాతీయ స్థాయికి చెందిన పలు మీడియా సంస్థలు ఫలితాలు వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉండబోతున్నట్లు చెప్పాయని వారు గుర్తు చేశారు. వైఎస్ జగన్ ప్రజల పక్షాన నిలిచినందుకే వైఎస్ఆర్ పార్టీని ప్రజలు ఆదరించారని అన్నారు. గడిచిన రెండున్నరయేళ్లుగా జగన్ ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉన్నారనీ, చేనేత కార్మికుల సమస్యలపై, రైతన్న, విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంటు గురించి పోరాటలు చేశాడనీ అన్నారు. సమస్యలపై సర్కార్ పై రాజీలేని పోరాటం చేశాడనీ తెలిపారు. ప్రజల సమస్యల గురించి ఉద్యమాలు చేశాడే కాబట్టి ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారనీ, దీన్ని మరిచి టీడీపీ, కాంగ్రెస్ నేతలు సానుభూతి అని, పాలపొంగు అని మాట్లాడటం తగదన్నారు. తొమ్మిదేళ్ల టీడీపీ కాలంలో ప్రజల గురించి చంద్రబాబు ఏమీ పట్టించుకోలేదనీ, దాని ఫలితమే ప్రజలు ఆ పార్టీని అధికారానికి దూరంగా పెడుతున్నారనీ చెప్పారు. రాష్ర్టంలో జరిగిన ఉప ఎన్నికల స్థానాలు తమవి కాదనీ చెబుతున్న టీడీపీ 210స్థానాలలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు లేరనీ, దీన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో 210నియోజక వర్గాల్లో టీడీపీ పోటీ చేయదా?అని ప్రశ్నించారు. చంద్రబాబు మాటల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియడం లేదన్నారు. ఉప ఎన్నికల ఫలితాలే వచ్చే ఎన్నికల్లో రిపీట్ అవుతాయనీ, రాష్ర్టంలో ప్రస్తుతం జగన్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారనీ వైఎస్ఆర్ నాయకులు చెప్పారు. జగన్ ప్రజా ప్రభంజనం ముందు అన్ని పార్టీలు కొట్టుకుపోవడం ఖాయమన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: