నెల్లూరులో ఒకటే ఉత్కంఠ.. జగన్, చంద్రబాబు ఇద్దరూ...!
అధికార...ప్రతిపక్ష పార్టీల బలాబలాల ప్రదర్శనకు నెల్లూరు వేదిక కానుంది. నెల్లూరులో ఒకే రోజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈనెల 15న వైఎస్ రైతు భరోసా కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంబించనున్నారు. అంతకుముందు రోజే.. జిల్లాకు రానున్న చంద్రబాబు.. నియోజకవర్గాల సమీక్షలు చేయనున్నారు.
నెల్లూరులో ఒకే రోజు సీఎం జగన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పర్యటనలు ఉన్నాయి. రాష్ట్రానికి చెందిన ఇద్దరు కీలక వ్యక్తులు నెల్లూరులో పర్యటిస్తుండటంతో ఇద్దరి భద్రత జిల్లా పోలీసులకు సవాలుగా మారింది. ముఖ్యమంత్రి అయ్యాక జగన్ మొదటిసారి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇక్కడి నుంచి వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని జగన్ ప్రారంభిస్తారు. అన్ని స్థానాలను గెలిచి ఊపు మీదున్నఅధికార పార్టీ ప్రజాప్రతినిధులు సభను విజయవంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సుమారు లక్ష మందికి పైగా హాజరు అయ్యే విధంగా సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభను విజయవంతం చేసి జిల్లా నేతల మధ్య ఎలాంటి లుకలుకలు లేవని చాటేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు...నెల్లూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన పార్టీకి కీలకం కానుంది. చంద్రబాబు పర్యటనను ఉపయోగించుకొని ప్రజల్లోకి వెళ్ళడానికి జిల్లా నాయకులు సిద్దమవుతున్నారు. ఈ మధ్య కాలంలో టీడీపీ మద్దతుదారుల రొయ్యల గుంటలు పూడ్చివేశారు. అనుమతులు లేని ఇళ్లను కూల్చివేశారు. ఈ పరిస్థితులలో వారు నేరుగా చంద్రబాబును కలిసే విధంగా ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరపనున్నారు పార్టీ అధినేత చంద్రబాబు. నియోజకవర్గం నుంచి వెయ్యి మందికి తక్కువ కాకుండా సమీక్షకు హాజరవుతారు. ఉదయగిరి నియోజకవర్గంతో ప్రారంభమై నెల్లూరు సిటి రివ్యూతో ముగిసే విధంగా అంతా సిద్ధం చేశారు పార్టీ నేతలు.