ఏపీ టీడీపీకి రాబోవు రోజులు మరింత గడ్డు రోజులేనా.. ఏపీలో అసలు టీడీపీ బతికి బట్ట కట్టేనా
అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. నాలుగు నెలలకు ముందున్న ప్రాభవం ఇప్పుడు టీడీపీలో కనుమరుగైందీ.. గాలి ఉన్నప్పుడే తూర్పార బట్టాలి అనేది సామేత. కానీ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మేలు బదులు కీడు చేయడం, నేతలు చేసిన దౌర్జన్యాలు, ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల్లా కొనడం, అధికారం అడ్డు పెట్టుకుని అవినీతికి పాల్పడంతో ప్రజలు టీడీపీ నేతలకు కర్రుకాల్చి వాత పెట్టారు. అయితే ఇప్పుడు అధికారం కోల్పోయిన టీడీపీ కి గడ్డుకాలం ప్రారంభమైందనే చెప్పవచ్చు.
అయితే ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఎలా ఉందంటే పులిమీద పుట్ర అన్నట్లుగా ఉంది. ఓవైపు అధికారం పోగానే నేతలంతా క్యూకట్టి ఇతర పార్టీలకు వలస పోతున్నారు. దీనికి తోడు కొందరు ఓడిపోవడంతో పార్టీతో సంబంధం లేన్నట్లుగానే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిన 23 నియోజకవర్గాల్లో అంతంత మాత్రంగానే టీడీపీ ఉంది. కానీ ఓడిన నియోజకవర్గాల్లో నేతలంతా గప్‌చుప్‌గా ఉండిపోతున్నారు. కేవలం కొందరు నేతలు మాత్రమే టీడీపీని పట్టుకుని ఉంటున్నారు. అయితే ఇటీవల గుంటూరు జిల్లాలో టీడీపీ పరిస్థితి చూస్తే జాలేస్తుంది. టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతితో గుంటూరు జిల్లా టీడీపీకి పెద్ద దిక్కు లేకుండా పోయిందనే చెప్పవచ్చు.
కోడెల శివప్రసాద రావు మరణంతో నరసారావుపేట, సత్తెన్నపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ చాప చుట్టేసే పరిస్థితికి చేరుకుంది. స్పీకర్ మృతి గుంటూరు జిల్లాలో టీడీపీకి కోలుకోలేని దెబ్బగానే భావించాలి. కోడెల నరసారావు పేటలో 1983 నుంచి 1999 వరకు అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా, 2004,2009ల్లో ఓడిపోయారు. 2014లో ఇక్కడి నుంచి బీజేపీ పోటీ చేసింది. దీంతో కోడెల సత్తెన్నపల్లి నుంచి బరిలోకి దిగాల్సి వచ్చింది. అక్కడ గెలిచిన కోడెల, 2019లో ఘోరంగా ఓటమి చెందాడు.
అయితే నరసారావుపేటలో టీడీపీ ఇన్‌చార్జీగా ఉన్న చదలవాడ అరవిందబాబు ఓటమి చెంది నిరాశతో పార్టీకి దూరంగా ఉన్నాడు. దీంతో అటు నరసారావుపేట, ఇటు సత్తెన్నపల్లిలో అసలు పార్టీని కాపాడే నేతలే లేకుండా పోయారు. ఒక్క కోడెల మృతితో ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ ఖాళీ అయినట్లే లెక్క. ఏపీలో విజయనగరం, కడప, నెల్లూరు జిల్లాలు టీడీపీ ఒక్క ఎమ్మెల్యే లేక నానా ఇబ్బందులు పడుతుంటే, ఇప్పుడు దీనికి తోడు గుంటూరు జిల్లాలోని ఈ రెండు నియోజకవర్గాలు పార్టీకి మంగళం పాడే పరిస్థితి దాపురించినట్లే..