క్రెడిట్ కార్డు ఇలా వాడితే.. మీ కొంప కొల్లేరే..?
మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. అయితే ఎప్పుడైనా బిల్లు కట్టేటప్పుడు.. మీరు కట్టాల్సిన మినిమమ్ ఎమౌంట్ ఇంత అని మెస్సేజ్ వస్తుంది.. అంటే.. ప్రస్తుతానికి అంత కడితే సరిపోతుంది. ఇది మన బిల్ కంటే చాలా తక్కువ మొత్తం ఉంటుంది. సరే ప్రస్తుతానికి ఇది కడితే చాలు కదా.. అని చాలా మంది మినిమమ్ ఎమౌంట్ కట్టి చేతులు దులుపుకుంటారు.
కానీ ఇలా మినిమమ్ ఎమౌంట్ కట్టడం ద్వారా మీకు చాలా నష్టం.. ఎందుకంటే.. మీరు మినిమమ్ ఎమౌంట్ కట్టిన తర్వాత కూడా మీ బిల్లు మొత్తంలో అదేమీ పెద్దగా కట్ కాదు. మళ్లీ మీరు వచ్చేనెల బిల్లు మొత్తం కట్టాల్సి ఉంటుంది. అంటే మీరు కట్టిన మినిమన్ మొత్తం రుసుముల కింద వడ్డీల కింద జమ అయిపోతుంది.
దీని వల్ల ప్రస్తుతానికి ఉపశమనంగా ఉన్నా.. మొత్తంగా చూసుకుంటే మీరు చెల్లించేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎప్పుడూ ఇలా మినిమమ్ ఎమౌంట్ కట్టేసి ఈ నెలకు బయటపడిపోదాం అనుకోవద్దు. ఇంకో విషయం ఏంటంటే.. ఇలా చేయడం ఓ అలవాటుగా మారిపోయి.. మీ ఆర్థిక క్రమశిక్షణ కోల్పోతారు. అది క్రెడిట్ కార్డు విచ్చలవిడి వాడకానికి దారి తీస్తుంది.
సాధారణంగా క్రెడిట్ కార్డును బట్టి క్రెడిట్ ఫ్రీ పీరియడ్ 20-50 రోజు ల వరకు ఉంటుంది. అంటే ఈకాలంలో ఎలాంటి వడ్డీని వసూలు చేయరన్నమాట. మీరు క్రెడిట్ కార్డును తీసుకునే ముందే క్రెడిట్ ఫ్రీ పీరియడ్ ఎంత ఉంటుందో తెలుసుకుంటే మంచిది. ఎంత ఎక్కువ క్రెడిట్ ఫ్రీ పీరియడ్ ఉంటే మీకు ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది.
క్రెడిట్ కార్డులపై వడ్డీ చాలా ఎక్కువగా ఉంటుంది. వార్షిక ప్రాతిపదికన తీసుకుంటే.. వడ్డీ రేటు 30 నుంచి 50 శాతం వరకు ఉంటుంది. చెల్లింపులో జాప్యం చేసినందుకు పెనాల్టీలు అన్నీ కలుపుకుంటే ఏడాదికి 50 నుంచి 60 శాతం వరకు ఉండవచ్చు. అంటే తడిసిమోపెడవుతుందన్నమాట.