తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకే టీడీపీ మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు అభ్యర్థి ఎవరు అనేది చర్చనీయాంశంగా మారింది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, టీ ఆర్ ఎస్, ఇతర చిన్నా చితక పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేశారు. అధికార టీ ఆర్ ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ముమ్మరంగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. అధికార టీ ఆర్ ఎస్ పార్టీ ప్రచారంలో ముందుంది. సామ, ధాన, దండోపాయాలు ప్రయోగిస్తూ అధికార తెరాస పార్టీ ప్రచారంలో దూసుకుపోతుండగా, కాంగ్రెస్ కూడా తనవంతుగా ముమ్మర ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
అయితే బీజేపీ ప్రచారంలో ఇంకా దూకుడు ప్రదర్శించడం లేదు కానీ, అభ్యర్థిని మాత్రం ప్రకటించేసారు. అయితే ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండ్రస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు మాత్రం ఇంకా టీడీపీ నుంచి అభ్యర్థిని బరిలో దింపుతారా లేదా అనే సందిగ్ధం నెలకొంది. ఈ సందిగ్ధానికి తెరదించుతూ ఉప పోరులో టీడీపీ అభ్యర్థని బరిలో నిలుపాలనే ఆలోచనలో టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు ఆలోచనలో ఉన్నారట. అందుకే శనివారం రాత్రి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో హుజూర్‌నగర్ నియోజకవర్గ నేతలతో పాటు, తెలంగాణ టీడీపీ నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో చంద్రబాబు టీడీపీ ఉప పోరులో నిలిచే పరిస్థితులను, అందుకు తగిన విధంగా ఉన్న అనుకూలాంశాలను కూలంకుశంగా చర్చించినట్లు తెలిసింది. అయితే చివరికి హుజూర్‌నగర్‌లో అభ్యర్థిని బరిలో నిలిచేందుకు నిర్ణయించినట్లు సమాచారం. టీడీపీ నుంచి పోటీ చేసేందుకు టీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, మాజీ ఎంపిపి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జీ చావా కిరణ్మయ్ పోటీ పడుతున్నారు. టీడీపీ టికెట్ కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతుండటంతో ఇద్దరిలో ఎవరి వైపు మొగ్గు చూపాలనే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉందట.
అయితే టీడీపీ అధికార ప్రతినిధిగా నన్నూరి నర్సిరెడ్డి కే సానుకూల అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. మాటల మాంత్రికుడిగా, అనర్గళంగా మాట్లాడటంతో దిట్ట. ప్రత్యర్థి పార్టీలను తన మాటలతో, ప్రాసలతో గుక్క తిప్పుకోకుండా ముప్పుతిప్పలు పెట్టడంతో ఆయనకు ఆయనే సాటి. ఆయన ప్రసంగాలకే అన్ని పార్టీల్లో అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పుడు నన్నూరి నర్సిరెడ్డిని ఎంపిక చేస్తారా.. లేక పార్టీ కోసం నియోజకవర్గంలో పనిచేస్తున్న మాజీ ఎంపీపీ, నియోజకవర్గ ఇన్‌చార్జీ కిరణ్మయ్‌ని ఎంపిక చేస్తారో వేచి చూడాల్సిందే.