జగన్.. ఆ ఐఏఎస్ అధికారిపై.. అందుకే పగబట్టాడా..?
ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారుల్లో అహ్మద్ బాబు అనే ఓ అధికారి ఉన్నారు. బాబు.ఎ గా ప్రాచుర్యంలో ఉన్న ఈ కలెక్టర్ కేరళకు చెందిన వారు. చక్కటి సమర్థుడు అన్న పేరు ఉంది. టెక్నాలజీలోనూ ముందుంటారు. చంద్రబాబు హయాంలో ఈ అధికారికి మంచి గుర్తింపు లభించింది. ఆర్జీజీఎస్ వ్యవస్థను రూపొందించింది కూడా ఈ బాబు.ఎ అని అంటారు.
అలాంటి ఐఏఎస్ అధికారి బాబు.ఎ పై సీఎం జగన్ పగబట్టారని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అంటున్నారు. తన కొత్తపలుకు వ్యాసంలో ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఆయన తన వ్యాసంలో ఏంరాశారంటే..
“ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నందిగామ ప్రాంతానికి వెళ్లిన ఆయనను అప్పట్లో కృష్ణా జిల్లా కలెక్టర్‌గా ఉన్న అహ్మద్‌బాబు అడ్డు కున్నారు. అది మనసులో పెట్టుకున్న జగన్.. సీఎం అయ్యాక నెల రోజులు దాటినా పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో జీతంపై ఆధారపడి బతికే తనకు పోస్టింగ్ ఇవ్వకపోతే కష్టంగా ఉంటుందని అహ్మద్ బాబు విజ్ఞప్తి చేయగా అదే విషయాన్ని పేర్కొంటూ ఆయనకు పోస్టింగ్ ఇస్తూ జీవో జారీ చేశారు.
కొత్త ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అవుతున్నప్పటికీ డజనుకు పైగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వలేదు. కొత్త పోస్టింగ్ వచ్చే వరకు అధికారులకు జీతభత్యాలు చెల్లించరు. నిజాయితీగా బతికే వారికి మూడు నెలల పాటు జీతం రాకపోతే ఇబ్బందే కదా? భిన్నమైన నైజం కలిగిన జగన్‌కు ఇలాంటి విషయాల్లో ఎదుటివారి కష్టాలు పట్టవు.
ఇలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ విమానాశ్రయంలో తనను అడ్డుకున్న పోలీస్ అధికారులు అందరికీ పోస్టింగులు లేకుండా చేశారు. ఆనాటి ప్రభుత్వ ఆదేశాల మేరకే సదరు అధికారులు ఆయన్ను అడ్డుకున్నారే గానీ, వ్యక్తిగత కక్షతో కాదు కదా? ”
అయితే పోస్టింగ్ ఇవ్వని ఐఏఎస్ అధికారులకు జీతం ఇవ్వరని.. జీతంపై బ్రతికే ఈ ఐఏఎస్‌లు ఆర్థికంగా ఇబ్బంది పడతారన్న వాదన అంత నమ్మశక్యంగా లేదు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇలా రాజకీయ నాయకులు ప్రభావితం చేయకుండా వారికి అనేక రక్షణలు ఉంటాయి. అలాంటిది పోస్టింగ్ ఇవ్వకపోతే జీతం రాదు అన్నది కూడా వాస్తవం కాకపోవచ్చు.