వైసిపి నేతలే జగన్ ను అడ్డంగా బుక్ చేసేస్తున్నారా ?

Vijaya

వైసిపి నేతలు తెలిసో తెలీకో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని అడ్డంగా బుక్ చేసేస్తున్నారు. మొన్న మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని నిర్మాణంపై మాట్లాడిన తర్వాత రేగిన గొడవ ఇంకా సద్దు మణగనే లేదు. తాజాగా రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి చేసిన ఓ ప్రకటనతో బిజెపి నేతలు జగన్ పై మండిపోతున్నారు.

 

జగన్ తీసుకుంటున్న అనేక అంశాలకు ప్రధానమంత్రి నరేంద్రమోడి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అనుమతి ఉందంటూ వైసిపి రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. దానిపై బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జగన్ పై మండిపోతున్నారు. పిపిఏల సమీక్ష, పోలవరం టెండర్ల రద్దు, కాంట్రాక్టుల విషయంలో రివర్స్ టెండరింగ్ నిర్ణయాలను మోడి, అమిత్ షా ఆమోదించారా అంటూ జగన్ ను కన్నా సూటిగా ప్రశ్నించారు. మరి ఈ ప్రశ్నకు విజయసాయి సమాధానం చెబుతారా ? లేకపోతే జనగ్ సమాధానం చెప్పాలా ?

 

విజయసాయి చెప్పినట్లుగా పిపిఏల సమీక్ష, పోలవరం కాంట్రాక్టుల రద్దు లాంటి కీలక నిర్ణయాలకు మోడి, షా మద్దతుంటే వ్యవహారం ఇలాగైతే ఉండదు. ఎందుకంటే, విద్యుత్ పిపిఏలను సమీక్షించవద్దని కేంద్ర కార్యదర్శే స్వయంగా చెప్పారు. పోలవరం కాంట్రాక్టులను రద్దు చేయద్దని పోలవరం అథారిటి ఎన్నోమార్లు జగన్ కు చెప్పింది. కేంద్రం నుండి అభ్యంతరాలు వచ్చినా వినకుండా జగన్ ముందుకే వెళ్ళారు.

 

మరి విజయసాయి చెబుతున్నట్లు నిజంగానే మోడి, అమిత్ షాల ఆమోదం ఉండుంటే పోలవరం అథారిటి కానీ కేంద్ర కార్యదర్శి కానీ జగన్ నిర్ణయాలను ఎలా తప్పుపట్టగలరు ? కాబట్టి విజయసాయి చెప్పిందాట్లో నిజం లేదని తెలిసిపోతోంది. ఆ విషయాన్నే కన్నా సూటిగా ప్రశ్నిస్తున్నారు. జగన్ తీసుకున్న నిర్ణయాలు రివర్స్ అయ్యేటప్పటికి వాటిని కేంద్రానికి ఆపాదిస్తున్నారంటూ మండిపోతున్నారు. మరి కన్నాప్రశ్నలకు జగన్ ఏమి సమాధానం చెబుతారో చూడాలి.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: