గుడిని మింగిన వాడు ఒకడైతే.. గుడిలో లింగాన్ని కూడా మింగేసిన మహాభావుడు మరొకరు! అన్నట్టుగా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.. గత చంద్రబాబు పాలనలో తమ్ముళ్లు మేసిన అవినీతి తాలూకు కథనాలు! ఇందులోఒక్కొక్కరిదీ ఒక్కొక్క కథలా ఉంది. మేం ఏమీ ఎరుగం.. అవినీతిపై యుద్ధం చేసిన మాకే అవినీతి తాలూకు మసి పూస్తారా? మీరే బురద గుంటలో ఉండి మాపై బురద జల్లుతారా? అంటూ వైసీపీ అధినేత జగన్‌పై దీర్ఘాలు తీసి మరీ దుమ్మెత్తి పోసిన టీడీపీ అధినేత చంద్రబాబును ఇంకా ఎవరూ మరిచిపోలేదు. ఆయన మాటలు ఇంకా గుర్తున్నాయి. అందరూ నిజమే అనుకున్నారు. జగన్ కక్ష పూరితంగానే వ్యవహరిస్తున్నారని, అనవసరంగా గెలిపించామని అనుకున్న మగానుభావులు కూడా ఉన్నారు.
అయితే, ఇంతలోనే వెలుగు చూస్తున్న ఒక్కొక్క సంగతి.. అధినేత అడ్డాలో తమ్ముళ్లు మేసిన అవినీతి ఎకరాలు దాటి హెక్టార్లను మించిందని తెలుసుకుని ప్రజలు నోళ్లెళ్ల బెడుతున్నారు. ఒకడు.. పాఠశాల గోడలకు వేసిన రంగుల్లో చేసిన దోపిడీని అప్పటి సీఎంగానే చంద్రబాబు హెచ్చరిస్తే.. ఇప్పుడు ఆ రంగుల వెనుక అసలు రంగు ఏంటో చూసేందుకు రంగం సిద్ధమైంది. ఇక, అక్కలు, చెల్లెళ్లకు పెద్దన్నగా సీమంతాలు చేయిస్తున్నానంటూ.. ఓ పల్నాడు నాయకుడు సాగించిన గనుల దోపిడీ.. కదలిక ప్రారంభమైంది.
ఇప్పటికే దీనిపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, తానేం చేయలేదని అంటూ.. మరో కోర్టుకు వెళ్లి సదరు ఆదేశాలను రద్దు చేయాలని కోరడం, కాదనడం జరిగిపోయాయి. ఇక, ఇసుకలో మేటలు వేసిన మాఫియా ఉదంతం కూడా తమ్ముళ్ల తప్పులను పట్టి చూపిస్తోంది. వీటిలో ఎవరెవరు ఎంతెంత వాటాలు మేశారో లెక్కలతో సహా చెప్పేందుకు సర్కారు రెడీ అవుతుండడం ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఇక, ఇంతలోనే కోడెల వారి కథ మరో చెమక్కు!!
నలభై ఏళ్ల నా రాజకీయ జీవితంగా అందరూ వేసిన మచ్చలు కడుక్కున్నానే కానీ, నాకంటూ ఏ మచ్చాలేదని ఓ నెల రోజుల కిందట గౌరవ నీయ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఓ ఆన్‌లైన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ చూసి.. నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన వారు నమ్మారని అనుకున్నారు. కానీ, ఇంతలోనే ఆయనకు ఆయనే చెప్పిన ఓ సంఘటన గురించి విని అందరూ నోరెళ్ల బెట్టారు.
అందరూ గనులూ, ఇసుకలూ చూసుకుని పక్కా దోపిడీకి స్కెచ్ వేస్తే.. కోడెల వారు క్లాస్‌గా అసెంబ్లీ ఏసీలు, ఫ్యాన్లు, ఫర్నిచర్‌ను తన ఇంటికి తరలించేసి శుభ్రంగా ఓ నాలుగేళ్లు వేడేసుకుని.. ఇప్పుడు ప్రభుత్వం దీనిపై కదలిక తెస్తే.. దొంగ ఎవరో తేల్చేందుకు పోలీసులు బెల్టును సవరించుకుంటున్న క్రమంలో.. తగుదునమ్మా.. అంటూ.. కోడెల వారు తనంతట తానే విషయాన్ని బయట పెట్టడం కడు చిత్రంగాను, విచిత్రంగాను దోపిడీ ఇలా కూడా ఉంటుందా? అని అనిపించేలా ఉంది.
ఒక పక్క కుమారుడు, కుమార్తెను జనాలపై వదిలేసిన ఆయన కేఎస్ ట్యాక్స్ పేరిట సాగించిన దందాపైనే గుంటూరు ప్రజలు మొత్తుకుంటున్నారు. ఈ క్రమంలోనే తనపై ఎక్కడ కేసు పెడతారోనని అనుకున్న కోడెల .. ఎప్పుడో 2015లో చేసిన ఏసీల దారిమళ్లింపు వ్యవహారాన్ని నేడు ఒప్పుకోవడం ఆయన ఏ రేంజ్‌లో ఆ పదవికి వన్నె తెచ్చారో తెలుస్తోందని బుగ్గలు నొక్కుకుంటున్నారు పరిశీలకులు.