దేశ చరిత్రలోనే జగన్ సెన్సేషనల్ రికార్డు..?

Chakravarthi Kalyan

ఏపీ సీఎం జగన్ దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించారు. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కీలకమైన మూడు బిల్లులను ఒకేరోజు అసెంబ్లీలో పెట్టి ఆమోదింపజేశారు. నవరత్నాలలో హామీ ఇచ్చిన విదంగా డెబ్బై శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలన్న బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింప జేశారు.


బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజకీయంగా, ఆర్థికంగా అండగా నిలుస్తూ.. ప్రభుత్వంలోని అన్ని నామినేటెడ్‌ పోస్టులు, నామినేషన్‌ పనుల్లో వారికి 50 శాతం కేటాయించేలా ఈ బిల్లులు రూపొందించారు. మళ్లీ ఈ కేటాయింపుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు సగం దక్కేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. మిగిలిన 50 శాతంలో కూడా సగం మహిళలకే కేటాయించాలని నిర్ణయించారు.


మరో కీలక బిల్లు ఉద్యోగాలకు సంబంధించినది. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే కల్పిస్తూ మరో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయాలన్నింటికీ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పించేందుకు వీలుగా రూపొందించిన బిల్లులను ప్రభుత్వం​ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.


ఈ చరిత్రాత్మక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత వైఎస్‌ జగన్‌ ఓ ట్వీట్‌ చేశారు. ‘దేశ, రాష్ట్ర చరిత్రలో ప్రథమం, సుదినం. మాట ప్రకారం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు, పనులు, సర్వీసుల్లో 50% రిజర్వేషన్లు ఇస్తున్నాం. 50% అక్కచెల్లెమ్మలకు కేటాయించాం. శాశ్వత బీసీ కమిషన్ సహా, పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా అసెంబ్లీలో బిల్లులు పెట్టాం’ అని జగన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: