జగన్ 30 రోజుల పాలనపై రోజా రేటింగ్..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెలరోజులు పూర్తి చేసుకున్నారు. తన 30 రోజుల పాలనలో ఆయన చాలా వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఆయన పాలనపై కొంత సానుకూలత, మరికొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నాయి.
జగన్ మంత్రి వర్గంలో తప్పకుండా స్థానం దక్కుతుందని ఆశించి భంగపడి.. ఆ తర్వాత ఏపీఐఐసీ ఛైర్మన్ పదవితో సరిపెట్టుకున్న వైసీపీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా.. జగన్ 30 రోజుల పాలనపై స్పందించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతిమాటను నిలబెట్టుకునే సత్తా జగన్ కే ఉందని ఆమె కితాబిచ్చారు.
జగన్ ముప్పై రోజుల పరిపాలన చాలా బావుందని.. జనరంజకంగా ఉందని రోజా కితాబిచ్చారు. వేగంగా, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో జగన్ వైఎస్సార్ ను మించిపోయారని ఆమె ప్రశంసించారు. అవినీతిరహితమైన పాలన అందించేందుకు జగన్ కృషి చేస్తున్నారని ఆమె మెచ్చుకున్నారు.
చంద్రబాబు ఐదేళ్ల ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని.. ఆ అవినీతి మొత్తాన్ని బయటపెడతామని రోజా అన్నారు. తిన్న అవినీతి సొమ్ము మొత్తం కక్కించేందుకు జగన్ కృషి చేస్తున్నారని రోజా అన్నారు. మొత్తం మీద జగన్ పాలనపై రోజా ఫుల్ శాటిస్ ఫై గా ఉన్నారు.