అటు అసెంబ్లీ, ఇటు సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తెలంగాణ కాంగ్రెస్‌ను అనేక కుదుపులకు గురి చేసింది. కీల కమైన పదవులకు నాయకులు రాజీనామా చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అధికార టీఆర్ ఎస్ హవాను కట్టడి చేయ డంలోను, కాంగ్రెస్ దూకుడు పెంచడంలో వెనుకబడ్డ నాయకుడిగా పేరు తెచ్చుకున్న కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ప రోక్షంగా పార్టీ సీనియర్ల నుంచి విమర్శలు ఎక్కువయ్యాయి. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయిం చుకున్నారని తాజాగా వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయాన్ని ఆయన ముందుగానే పార్టీ అధిష్టానానికి వివరిం చారని, కానీ, నెల రోజులు కొనసాగాలని సూచించడంతో ప్రస్తుతం ఆయన కొనసాగుతున్నారని తెలుస్తోంది.
2014 కు ముందు ఏపీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పీసీసీ పదవిని చేపట్టారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేరుగా రాహుల్ గాంధీతో చనువు ఉన్న నాయకుడిగా ఆయనకు పేరుంది. పైగా కాంగ్రెస్‌లో ఆయన కుటుంబం చురుగ్గా వ్యవహరించడం కూడా బాగా కలిసి వచ్చింది. అప్పటి ఎన్నికల్లోనే దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భావించినా.. రాలేదు. అయితే, ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా అవతరించిన టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చినా.. బొటా బొటీ సీట్లకే పరిమితమయ్యేలా మాత్రం ఉత్తమ్ వ్యవహరించారు. ఇలా తను బాధ్యతలు స్వీకరించిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఒకింత ఆయన సక్సెస్ అయ్యారు.
అయితే, ఆ తర్వాత మాత్రం పార్టీ నేతలని అదుపు చేయడంలోను, పార్టీని అధికారంలోకి తీసుకు రావడంలోను ఉత్తమ్ సక్సెస్ కాలేక పోయారు. ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ నుంచి గద్వాల్ జేజమ్మ.. డీకే అరుణ వంటి వారి దూకుడుకు కళ్లాలు వేయడంలోను ఉత్తమ్ ఘోరంగా విఫలమయ్యారు. ఇక, పార్టీ ఫిరాయింపులను అడ్డుకోవడంలో ఆయన చొరవ చూపించలేక పోయారు. దీంతో సంస్థాగతంగా కాంగ్రెస్ బలహీనమైంది. ఇది గత ఏడాది డిసెంబరులో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. కనీస స్థానాల్లో కూడా పార్టీ విజయం సాధించలేక పోయింది.
ఇక, పార్లమెంటు స్థానాల్లోనూ ఏమీ లేదనుకున్న బీజేపీ సాధించినన్ని సీట్ల కూడా కాంగ్రెస్ విజయం సాధించలేక పోయింది. దీంతో ఉత్తమ్ సారథ్యంపై విమర్శల మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో ఆయన నైతిక బాధ్యత వహిస్తూ.. రాజీనామాకు సిద్ధమయ్యారు. ఇక, ఈ రేసులో.. కోమటిరెడ్డి సోదరులతో పాటు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్నట్టు సమాచారం. మరి అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందో చూడాలి.