ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే వైఎస్ జగన్ మోహన రెడ్డి మార్కు పాలన మొదలైంది. సీఎంఓ ప్రక్షాళనకు జగన్ శ్రీకారం చుట్టారు. ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే కీలక స్థానాల్లోని ఐఏఎస్ అధికారులు బదిలీ కావడం ఆసక్తి రేపుతోంది. చంద్రబాు టీమ్ గా ముద్రపడ్డ వారికి స్థాన చలనం కలిగింది.
ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఉన్నతాధికారుల బదిలీలు ప్రారంభం అయ్యాయి. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ‍్యతలు స్వీకరించిన అనంతరం సీఎంవో అధికారులపై బదిలీ వేటు పడింది. చంద్రబాబుకు సీఎంకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సతీష్ చంద్ర, ముఖ్య కార‍్యదర్శి సాయి ప్రసాద్, సీఎం కార్యదర్శిలు గిరిజా
శంకర్, రాజమౌళిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
బదిలీ అయిన ఐఏఎస్ లు అంతా... సాధారణ పరిపాలనా శాఖకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఒకేసారి నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడటం సాధారణ విషయం ఏమీ కాదు. కాకపోతే కీలకమైన సీఎంఓలో ముఖ్యమంత్రికి నచ్చిన, మెచ్చిన అధికారులను నియమించుకోవడం ప్రభుత్వాలు మారినప్పుడు జరిగేదే.
ఇక ఇప్పుడు బదిలీ అయిన వారి స్థానంలౌ జగన్ టీమ్ అధికారులు అడుగు పెడతారన్నమాట. ఇప్పటికే ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా ధనుంజయ్ రెడ్డి నియమితులయ్యారు. ఇక మిలిగిన అధికారుల నియామకమూ జోరంకుంటుందన్నమాట.