పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం నుంచి టీడీపీ కాంట్రవర్సీ కింగ్ చింతమనేనిని నియోజకవర్గ ప్రజలు ఇంటికి పంపించేశారు. ఇక్కడ నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన వైసీపీ యూరప్, యూకే కన్వీనర్ కొఠారు అబ్బయ్య చౌదరి ఘనవిజయం సాధించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అబ్బయ్యచౌదరికి 10 వేల ఓట్ల పైచిలుకు మెజార్టీ వచ్చింది. చింతమనేనిని ఈ ఎన్నికల్లో ఓడించేందుకు వైసీపీ అధినేత ప్రత్యేకమైన ప్రణాళికలు వేసుకున్నారు.
వరుస విజయాలతో ఊపుమీదున్న నాయకు డిగా, నిత్యం ఏదో ఒక వివాదాస్పద అంశాన్ని భుజాన వేసుకున్న ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు చింతమనేని ప్రభాకర్. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్‌గా ముద్ర వేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనను ఎలాగైనా ఓడించాలని వైసీపీ అధినేత జగన్ కంకణం కట్టుకుని మరీ ఇక్కడ వ్యూహాలు వేశారు. ఇక్కడ నుంచి ముందుగా అనుకున్న అభ్యర్థిని రెండేళ్ల కిందటే పక్కన పెట్టి.. ఎన్నారై అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరిని ఇక్కడ రంగంలోకి దింపారు.
దీంతో ఇద్దరి మధ్య హోరా హోరీ పోరుసాగింది. ముఖ్యంగా పవన్‌తో విభేదించిన చింతమనేనికి స్థానికంగా కూడా ఎదురుగాలి జోరుగా వీచింది. యువత మొత్తంగా చింతమనేనికి యాంటీ అయ్యారనే ప్రచారం కూడా సాగింది. ఇక, వివిధ సామాజిక వర్గాలు కూడా ఆయనకు కలిసి రాలేదని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా తన సొంత కమ్మ వర్గంలోనే చీలిక వచ్చి.. చింతమేనేనికి యాంటీ అయ్యారని తెలిసింది. ఇక, కొఠారు అబ్బయ్య యువతను తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. చింతమేననికి యాంటీగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ఈ నియోజకవర్గంలో చింతమనేని హవాకు బ్రేక్ పడుతుందనే ప్రచారం జరిగిన నేపథ్యంలో తాజా ఫలితాలు ఉత్కంఠకు తెరదించాయి.
ముందుగా ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందని అనుకున్నా... ఫలితాల్లో మాత్రం ముందు నుంచి అబ్బయ్య చౌదరి ఆధిపత్యమే కొనసాగింది. తొలి రౌండ్ నుంచి ఆయన స్పష్టమైన ఆధిక్యం కనపరిచారు. చింతమనేని ఓడిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక దెందులూరు నియోజకవర్గంలో వైసీపీ శ్రేణలు ఆనందానికి అవధులే లేవు.