చంద్రబాబు వాళ్లను ‘లైట్’ తీసుకోవడానికి కారణమేంటి?

Vasishta

ఎన్నికలు సమీపిస్తున్నాయ్.. రాష్ట్రంలో రాజకీయం రసవత్తర మలుపులు తిరుగుతోంది. జగన్, చంద్రబాబు వేస్తున్న ఎత్తులతో పాలిటిక్స్ రోజురోజుకూ రంజుగా మారిపోతున్నాయి. సంక్షేమ అస్త్రాలతో చంద్రబాబు ముందుకెళ్తుంటే.. ఆపరేషన్ ఆకర్ష్ తో జగన్ ఎత్తులు వేస్తున్నారు. ప్రజలకు నేరుగా లబ్ది చేకూర్చే పథకాలతో ఓటుబ్యాంకును పదిలం చేసుకునే పనిలో చంద్రబాబు ఉంటే.. టీడీపీ నుంచి నేతలను చేర్చుకోవడం ద్వారా జగన్ పార్టీ శ్రేణల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు.


నెల రోజుల క్రితం వరకూ నేతల వలసలన్నీ దాదాపు అధికార పార్టీ వైపే నడిచాయి. ఇప్పుడేమో అధికారపక్షం వాళ్లు కూడా ప్రతిపక్షం వైపు మళ్లుతున్నారు. మేడా మల్లికార్జున రెడ్డితో మొదలైన వలస, ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్ ల దాకా సాగింది. ఇది మున్ముందు మరింత కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మరికొంతమంది టీడీపీ సానుభూతి పరులు, టీడీపీ మాజీ నేతలు కూడా జగన్ పంచన చేరారు. అయితే ఈ చేరికలను టీడీపీ మాత్రం చాలా లైట్ తీసుకుంటోంది.


టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ సుమారు ఏడాదిక్రితమే వైసీపీలో చేరబోతున్నారనే టాక్ వినిపించింది. టీడీపీ తరపున ఆయనకు టికెట్ మళ్లీ కన్ఫామ్ కాకపోవచ్చనే కారణమే ఆయన్ను జగన్ వైపు వెళ్లేలా చేసిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ అంతర్గత సర్వేల్లో అవంతికి ఏమాత్రం పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాకపోవడంతో అధిష్టానం ఆయనకు ఆ విషయం కన్వే చేసినట్లు సమాచారం. దీంతో ఇక్కడే ఉంటే టికెట్ రాకపోవచ్చని భావించి వైసీపీలోకి వెళ్తారనే టాక్ ఏడాదిగా వినిపిస్తోంది. దీంతో అవంతి వెళ్లినా పార్టీ నుంచి పెద్దగా స్పందన లేదు. కానీ ఆమంచిని ఆపడానికి మాత్రం చాలా ట్రై చేశారు. కానీ ఆమంచి తగిన గుర్తింపు రాలేదనే కారణంతో వెళ్లిపోయారు.


అయితే... ఇకపై ఎవరు పార్టీ నుంచి వెళ్లిపోతామనుకున్నా వారిని బుజ్జగించవద్దని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో టికెట్లు రాకపోయే వాళ్లు పార్టీలు మారడం సహజమనే ఫీలింగ్ లో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. అలాంటి వారికోసం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదనే భావన చంద్రబాబులో ఉంది. ఐదేళ్లపాటు పార్టీ ద్వారా, ప్రభుత్వం ద్వారా లబ్దిపొంది ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్లే వారి గురించి ప్రజలే తగిన నిర్ణయం తీసుకుంటారని, ఇప్పుడు అలాంటి వారిని పెద్దగా పట్టించుకోవద్దని టీడీపీ అగ్రశ్రేణి నాయకత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి లీడర్లు వెళ్లిపోయినా ఈసారి తాము చేపట్టిన సంక్షేమ పథకాలే గెలిపిస్తాయనే ధీమా టీడీపీలో కనిపిస్తోంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో..!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: