లగడపాటి వెనుక ఆంధ్రా బెట్టింగ్ మాఫియా హస్తం..?

Chakravarthi Kalyan

ఎన్నికల సర్వేల్లో పేరున్న లగడపాటి రాజగోపాల్ అంచనా తెలంగాణ ఎన్నికల విషంలో ఘోరంగా తప్పిన సంగతి తెలిసిందే. అయితే అసలు లగడపాటి ఎన్నికల సర్వేనే చేయలేదని.. అంతా బోగస్ ప్రచారమేనని కొందరు ఇంతకుముందే ఆరోపించారు. ఆంధ్రా ఆక్టోపస్ గా పేరున్న ఆయన ఇప్పుడు సోషల్ మీడియాలో లాఫింగ్ స్టాక్ అయ్యారు. ఆయనపై బోలెడు జోకులు పేలుతున్నాయి.



మరి ఎందుకిలా అయ్యింది.. దీనికి ఎన్నో విశ్లేషణలు వినిపిస్తున్నాయి. లగడపాటి సర్వేలో టీఆర్‌ఎస్ గెలుస్తుందని తెలిసినా.. ప్రజాకూటమికి బూస్టప్ ఇచ్చేందుకే ఆయన తప్పుగా చెప్పారని కొందరు అంటున్నారు. చంద్రబాబు వెనుక ఉండి ఆడించిన నాటమని చెబుతున్నారు. ఏపీలో రాజ్యసభ సీటు కోసమే లగడపాటి ఇదంతా చేశాడన్న వాదనా ఉంది.


ఐతే.. మరో కొత్త వాదన సంచలనం సృష్టిస్తోంది. తెలంగాణ ఎన్నికలపై వందల కోట్లలో బెట్టింగ్ జరిగిందని.. వారికి మేలు చేసేందుకే లగడపాటి ప్రజాకూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందని చెప్పారని పరకాల నుంచి విజయం సాధించిన చల్లా ధర్మారెడ్డి అంటున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ తమకు ఆంధ్రా నుంచి చాలామంది ఫోన్‌ చేసి మీరు ఓడిపోతారని పందెం కాశామని పరిస్థితి ఎలా ఉందని అడిగారని.. వారికి తాను తప్పకుండా గెలుస్తున్నా.. మీ బెట్టింగ్ పైసల్ వాపస్ తీసుకోమని సలహా ఇచ్చానని చెప్పారు.



తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఏకపక్షంగా గెలుస్తే బెట్టింగ్‌ కు ఆస్కారం ఉండేది కాదని.. అందుకే హోరాహోరా పోరాటం అంటేనే పందేలు కడతారని ధర్మారెడ్డి విశ్లేషించారు. బెట్టింగ్ మాఫియాకు మేలు చేసేందుకే లగడపాటి రాజగోపాల్ ప్రజాకూటమి గెలుస్తుందని ప్రజలను తప్పుదోవ పట్టించారని ధర్మారెడ్డి అంటున్నారు. మరి ధర్మారెడ్డి అధికారపక్ష ఎమ్మెల్యే కాబట్టి.. దీనిపై విచారణ జరిపేందుకు కృషి చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయేమో..?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: