వంగవీటి మాటలు జగన్ వింటాడా...!
వంగవీటి సీటు విషయం లో చెలరేగిన జ్వాలలు అంత ఇంత కాదు. వైసీపీ అధినాయకత్వం రాధను విజయవాడ ఈస్ట్ కు పంపించాలనుకున్నది కానీ రాధ దానికి అలుగుతున్నాడు. కోరిన టికెట్ ఇవ్వకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడటమే అనే సంకేతాలను స్పష్టంగానే ఇస్తున్న వంగవీటి రాధా వర్గం ఈ విషయంలో మరీ దూకుడుగా వెళ్లడం లేదని స్పష్టం అవుతోంది. ఈ గ్రూప్ వైసీపీలో ఖాయంగా కొనసాగుతుందనే నమ్మకాలు లేకపోయినా... ఇప్పుడు కొన్ని కొత్త ప్రతిపాదనలు పెడుతోందని వార్తలు వస్తున్నాయి. ఏ ప్రతిపాదన అయినా విజయవాడ సెంట్రల్ రాధాకు దక్కాలనే అంశం చుట్టూనే ఉంది.
మల్లాది విష్ణుకు టికెట్ ఇవ్వొద్దు అని తాము అనడం లేదని.. విష్ణుకు విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వాలని వంగవీటి వర్గం అంటోంది. విజయవాడ సెంట్రల్ రాధాకు కేటాయించేసి, విష్ణును విజయవాడ ఎంపీగా పోటీ చేయించాలని ఈ వర్గం ప్రతిపాదిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదన పట్ల కూడా వైసీపీ అధిష్టానం అంత సానుకూలంగా కనిపించడం లేదు. కాపుల ఓట్లు గంపగుత్తగా ఉన్న విజయవాడ ఈస్ట్ వంగవీటికి తగిన నియోజకవర్గం అనేది అధిష్టానం వాదనగా స్పష్టం అవుతోంది.
మరి విజయవాడ ఈస్ట్ రాధాకు ఇస్తే.. యలమంచిలి పరిస్థితి ఏమిటి? అనేదానికి ఇంకా సమాధానం లేదు. ఇక రాధాకు బయట నుంచి ఆహ్వానాలు అయితే ఉన్నాయి. అటు జనసేన అయినా, ఇటు టీడీపీ అయినా వస్తే వద్దనే పరిస్థితి ఉండదు. కానీ.. అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు తప్పవు. జనసేనలో విజయవాడ సెంట్రల్ సీటుకు బోండా ఉమ కర్చీఫ్ వేశాడనే మాట వినిపిస్తోంది.