చిధ్రమవుతున్న చిన్నారుల బతుకులు!

Narayana Molleti

మొగ్గలు వికసించడం పువ్వులుగా పరిమళించడం సహజమైన పరిణామం, మొగ్గలు మొగ్గలుగానే రాలిపోవడం సృష్టికి అపవాదం! అపవాదాన్ని నిర్మూలించడానికి ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ మొగ్గలు రాలిపోతునే ఉన్నాయి, చీకటిలో మగ్గిపోతూనే ఉ న్నాయి. వెలుగు నిరంతరం విస్తరిస్తున్నప్పటికీ సందు చూసుకుని చీకటి తొంగి చూస్తూనే ఉండడం నడుస్తున్న చరిత్ర. దేశంలోని అన్ని రాష్ట్రాలలోను ఈ చరిత్రకు పునరావృత్తి ఏర్పడుతూనే ఉంది..


హైదరాబాద్ మహానగర ప్రాంగణంలోనే నాగరికం మధ్యలోనే అనాగరికమైన ఈ చీకటి గుహలు నెలకొని ఉన్నాయట! బడికెళ్లి పాఠాలు నేర్చుకోవలసిన బుడుతలు ఈ చీకటి లోగిళ్లలో ఇటుకలను మోస్తున్నారట, చుట్టి గంపలను నెత్తిన పెట్టుకుని కనిపిస్తున్నారట! ఇలా మట్టిని మోస్తున్న పసిపిల్లలలో ఆరు ఏళ్లు నిండని వారు కూడ ఉండడం వాణిజ్య పారిశ్రామిక బీభత్సకాండకు పరాకాష్ఠ.. హైదరాబాద్‌లోనే కాదు, తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశమంతటా ఈ వాణిజ్య బీభత్స క్రీడ కొనసాగుతునే ఉంది.


పదేళ్లు కూడ నిండని పసిపాపలు పత్తిపొలాలలో పనిచేస్తున్నా రు, ప్లాస్టిక్ బట్టీలలో కుమిలిపోతున్నారు, కమలిపోతున్నారు. ఇటుకల తయారీ కోసం మట్టిని తవ్వుతున్నారు, మోస్తున్నారు. పదునాలుగేళ్ల లోపు వారందరికీ నిర్బంధోచిత విద్యా సముపార్జన హక్కు లభించి ఏళ్లు గడిచిపోతున్నాయి. అయినప్పటికీ పాఠశాలకు వెళ్లవలసిన పాపలను కూలీలుగా మార్చి ఇళ్ల నుంచి పల్లెల నుంచి సుదూర ప్రాంతాలకు తరలించుకునిపోతున్న ముఠాలు యథావిధిగా పనిచేస్తునే ఉన్నాయి..ఇలా ఒడిశా, చత్తీస్‌గఢ్, బిహార్, పశ్చిమబంగ వంటి సుదూర ప్రాంతాల నుంచి రవాణా అయిన వందల వందల మంది బాల బాలికలు హైదరాబాద్‌లోను పరిసర ప్రాంతాలలోను ఇటుకల బట్టీలలోను గాజుల బట్టీలలోను పనిచేస్తున్నారట! భువనగిరి యాదాద్రి జిల్లాలో ఇలా మగ్గిపోతున్న నాలుగు వందల మంది బాల కార్మికులకు మంగళ బుధవారాల్లో పోలీసులు విముక్తిని కలిగించడం దేశ ప్రజలందరూ హర్షించదగిన పరిణామం. పోలీసుల చర్య ప్రశంసనీయం.


కానీ పోలీసుల నిఘా నేత్రాల దృష్టి ప్రసరించని చోట ఇంకా ఎన్ని వందల వేల మంది చిన్నారులు ఇప్పటికీ కూలి పని చేస్తున్నారన్నది దేశ ప్రజలను కలవరపరచదగిన కఠోర వాస్తవం! రాచకొండ పోలీసులు నిర్వహిస్తున్న దరహాస చర్య-ఆపరేషన్ స్మయిల్-లో భాగంగా గత ఏడాది దాదాపు పద్నాలుగు వందల బాల కార్మికులకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి కలిగించారట! ఈ దరహాస చర్యలలో భాగంగా ఇప్పటివరకు ఏడువేల మంది బాల బాలికలకు ఇటుకల బట్టీల నుంచి విముక్తి కలిగిందట! దేశమంతటా ఎంతమంది చిన్నారుల బతుకులు ఇలా మొగ్గలుగానే రాలిపోతున్నాయో? రాక్షసత్వం రాజ్యమేలుతోంది.. రహస్యంగా! బాల కార్మికులుగా బాల బాలికలు బలైపోతుండడానికి ప్రధాన కారణం పేదరికం.. పేదరికానికి అజ్ఞానం తోడు కావడం! కానీ స్వతంత్ర భారతదేశంలో ఏడు దశాబ్దులు పేదరిక నిర్మూలన కోసం వందలాది పథకాలను అమలు చేసాయి. స్వచ్ఛంద సంస్థలు సంక్షేమం గురించి ప్రగతి గురించి పాటుపడుతున్నాయి.


అక్షరాస్యతపై అవగాహనను పెంచడానికి జరిగిన, జరుగుతున్న ఆర్భాటం అంతా ఇంతా కాదు! దశాబ్దులకు పూర్వం ఉమ్మడి నిరుపేద కుటుంబాలలో తల్లిదండ్రులు కూలి పనికి వెడితే, శిశువులను సంరక్షించే పని బాల బాలికలు నిర్వర్తించవలసి వచ్చేదట! ‘ఏం పాపా బడికిపోలేదా?’అన్న ప్రశ్నకు ‘మా యమ్మ పనికిపోయింది, మా తమ్ముణ్ణి ఎత్తుకోవాలి’ అన్న సమాధానాలు వినబడేవి! ఇప్పుడు కుటుంబ నియంత్రణ మారుమూల పల్లెల్లో సైతం అమలు జరుగుతోంది! అందువల్ల ఎక్కువమంది పిల్లల బెడద తల్లిదండ్రులకు లేదు. ఇటీవలి కాలంలో కేంద్ర రాష్ట్రాలు అమలు జరుపుతున్న ఉపాధి పథకాలవల్ల, చౌక ధరలకు నిత్యావసర సామగ్రిని సరఫరా చేస్తున్నందువల్ల పిల్లలతో పనిచేయించవలసిన దుస్థితి తొలగినట్టు ప్రచారవౌతోంది! నిర్బంధ నిశ్శుల్క ప్రాథమిక విద్య చిన్నపిల్లల ప్రాథమిక హక్కుగా మారింది. మధ్యాహ్న భోజన పథకాలు, అంగన్ వాడీ మాతా శిశుసంరక్షణ పథకాలు అమలు జరుగుతున్నాయి.


కానీ ఇదంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతోంది! బడికెళ్లి అక్షర రూపాలుగా వికసించదగిన లక్షలాది బాలబాలికలు బట్టీలకెళ్లి మట్టికొని పోతున్నారు.. విశ్వగురువుగా విరాజిల్లిన జాతి మళ్లీ మళ్లీ ఆత్మమథనం చేసుకోవలసిన అనివార్యత ఏర్పడి ఉంది! ఇది ప్రభుత్వ రాజకీయ నిర్వాహకుల వైఫల్యం, ప్రభుత్వ విధానాల వైఫల్యం, ప్రభుత్వ యంత్రాంగాల వైఫల్యం, ప్రజల వైపల్యం. సమష్టి జాతీయ వైఫల్యం! పదే పదే పట్టుబడుతున్నప్పటికీ మానవీయ భా వం అంకురించని కరకు గుండెల కసాయివారు ముఠాలుగా ఏర్పడుతునే ఉన్నారు, చిన్న పిల్లలను దూరదూర ప్రాంతాలకు తరలించుకొని పోతున్నారు.


బానిసత్వపుబంధంతో బిగిస్తున్నారు! తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలను అపహరించడం వేఱు. కాని అత్యధిక శాతం పిల్లలను తల్లిదండ్రులే ఈ చాకిరీ ముఠాలకు అప్పచెపుతున్నారు. తమ నివాసాలకు సమీప ప్రాంతాలలోని బట్టీలకు తమ పిల్లలను పంపడమే తల్లిదండ్రుల క్రూరత్వానికి నిదర్శనం. అలాంటిది బిహార్, బెంగాల్ వంటి చోట్ల ఉంటున్నవారు తెలుగు రాష్ట్రాలకు తమ పిల్లలను వెట్టి చాకిరీ చేయడానికి ఎలా పంపగలుగుతున్నారు? ఇలా పంపుతున్నవారు, తరలిస్తున్న ముఠాలు, పిల్లల చేత పని చేయిస్తున్న బట్టీల యజమానులు సమాజ విద్రోహులు..


తెలుగు రాష్ట్రాలలో పనిచేస్తున్న బాల కార్మికులలో తొంబయి శాతం ఇతర రాష్ట్రాల నుంచి తరలింపునకు గురైన అభాగ్య బాల బాలికలట.. ఇలాంటి చిన్న పిల్లలు పనిచేసిన తరువాత ఎక్కడ ఉంటున్నారు? ఏమి తింటున్నారు? తల్లిదండ్రుల ఆలనకు పాలనకు లాలనకు నోచుకోని చిన్నారులు ఇలా లక్షల సంఖ్యలో ఉండడం మన జాతీయ సంస్కారానికే కళంకం.. ‘నితాంత అపార భూతదయ..’ ప్రబోధాలకు పరిమితమైపోవడం స్వచ్ఛ్భారత్‌ను నిలదీస్తున్న వైపరీత్యం! కేవలం భౌతిక స్వచ్ఛత, పరిసరాల పరిశుభ్రత వల్ల స్వచ్ఛ్భారత్ ఏర్పడబోదు.. మానసిక స్వచ్ఛత జనజీవనంలో స్వచ్ఛత ఏర్పడినప్పుడు మాత్రమే నిజమైన స్వచ్ఛ్భారత్ అవతరించగలదు... అలాంటి స్వచ్ఛత పెద్దలలో ప్రముఖులలో ఏర్పడినప్పుడు మాత్రమే చిన్నపిల్లల అపహరణలు అంతరిస్తాయి.


పిల్లలను సేవ పేరుతో మతం మార్చుతున్న ముఠాలు, పిల్లల చేత పని చేయిస్తున్న తండాలు తొలగిపోతాయి! ఉపాధ్యాయులు, పాఠశాలల నిర్వాహకుల క్రూరంగా ప్రవర్తించడం వల్ల మానసికమైన ఒత్తడికి, సంఘర్షణకు గురి అవుతున్న చిన్న పిల్లలు బడికి వెళ్లడం మానుకుంటున్నారు. దేశం మొత్తం మీద ఇలా అర్భకులు అర్ధాంతరంగా అక్షరాలకు దూరం కావడానికి ‘అయ్యవార్ల’, విద్యావ్యాపారుల దౌర్జన్యం కూడ ఒక ప్రధాన కారణం! బడికి వెళ్లని పిల్లలు బట్టీల్లో రోజుకు రెండు రూపాయల కూలి పని చే స్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో సంభవించాయి! ఈ నిస్సహాయ శిశువుల మనోభావాలను కొలవగల ‘మానదండం’ ఏదీ...?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: