వచ్చే మార్చినాటికి జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం ఏపీలో అధికార టీడీపీలో విపరీతమైన పోటీ నెలకొంది. ఈ సారి టీడీపీ నుంచి రాజ్యసభకు వెళ్లాలని పలువురు సీనియర్లు, బడా పారిశ్రామికవేత్తలు, ఇతర రంగాలకు చెందిన వారు పోటీపడుతున్నారు. ప్రస్తుతం ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాథినిత్యం వహిస్తోన్న వారిలో మాజీ హోం మంత్రి దేవేందర్‌గౌడ్, సీఎం.రమేష్, చిరంజీవి ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ స్మాష్ అయ్యింది. దీంతో గతంలో ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపికైన చిరంజీవికి మరోసారి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఛాన్స్ ఇచ్చే పరిస్థితులు లేవు. ఇక దేవేందర్‌గౌడ్ అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో ఆయనకు ఏపీ కోటాలో ఎలాగూ రాజ్యసభ సీటు ఇవ్వరు. ఇక సీఎం.రమేష్ ఇటీవల టీడీపీలో కాంట్రవర్సీ కింగ్‌గా మారారు.
ఇక కడప జిల్లా టీడీపీ వ్యవహారాల్లో రమేష్ మితిమీరిన జోక్యంపై ఈ జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు చంద్రబాబుకు లెక్కకు మిక్కిలిగా ఫిర్యాదులు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు కెవిపి.రామచంద్రరావుతో కలిసి ఆయన వ్యాపారాలు చేస్తోన్న అంశంపై కూడా బాబు వద్ద నివేదికలు ఉన్నట్టు టాక్. ఇదిలా ఉంటే తనకు ఎలాగూ మరోసారి రాజ్యసభ సీటు రెన్యువల్ కాదని డిసైడ్ అయిన రమేష్ వచ్చే ఎన్నికల్లో ప్రొద్దుటూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ లెక్కన ఇప్పుడు రిటైర్ అవుతోన్న ముగ్గురికి మరోసారి ఛాన్సులు దక్కడం కష్టమే.
ఇక టీడీపీకి ఎలాగూ రెండుసీట్లు గ్యారెంటీగా దక్కుతాయి. ఎన్నికల టైంకు మరికొంత మంది ఎమ్మెల్యేలు జంప్ చేసేయనున్నారు. దీంతో మూడు సీట్లు టీడీపీకే దక్కేలా చంద్రబాబు ఆపరేషన్ ఉంటుందని అర్థమైపోయింది. ఇక ఈ మూడు సీట్ల కోసం టీడీపీ నుంచి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు బీసీ కోటాలో రేసులో ఉన్నారు. సీనియర్ అయిన ఆయన కీలకశాఖకు మంత్రిగా ఉండి గతంలో ఉన్నంత స్పీడ్‌గా ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన్ను గౌరవంగా పక్కకు తప్పించేందుకు రాజ్యసభ సీటు రెడీ అవుతోంది. ఇక వైసీపీ అధినేత జగన్ సామాజికవర్గం అయిన రెడ్డి సామాజికవర్గం కోటాలో కడప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ సతీష్‌కుమార్‌రెడ్డి ముందంజలో ఉండగా, నెల్లూరు జిల్లా నుంచి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
ఇక ఎస్సీ కోటాలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు, మాజీ స్పీకర్ ప్రతిభాభారతి రంగంలో ఉన్నారు. ఇక కమ్మ సామాజికవర్గం నుంచి కంభంపాటి రామ్మోహన్‌రావు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం రాజ్యసభ ఆశిస్తున్నారు. ఇక ఈనాడు అధినేత రామోజీరావు బంధువు ఒకరు, చంద్రబాబు బావమరిది హరికృష్ణ కూడా రాజ్యసభ ఆశిస్తున్నట్టు సమాచారం. ఎవరి ఆశలు ఎలా ఉన్నా టీడీపీ నుంచి ఎంపిక చేసే రాజ్యసభ సీట్ల విషయంలో ఫైనల్ డెసిషన్ చంద్రబాబు, లోకేష్‌లదే కానుందని సమాచారం.