తెలంగాణ పాలిటిక్స్‌లో మ‌రో వార‌సుడు..!

VUYYURU SUBHASH
దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకోవాల‌న్న నానుడిని నిజం చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు. త‌మ వార‌సులు పొలిటిక‌ల్ బ‌రిలోకి దించేందుకు వీరంతా ఒక‌రితో మ‌రొక‌రు పోటీ ప‌డుతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో వారికి నచ్చిన నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేయించేందుకు ఇప్ప‌టినుంచే పావులు క‌దుపుతున్నారు. తెలంగాణ‌లో త‌మ‌కు బాగా ప‌ట్టున్న కొన్ని జిల్లాల నుంచి కొడుకుల‌ను రంగంలోకి దించాల‌ని సీనియ‌ర్ నాయ‌కులంతా వేచిచూస్తున్నారు. ఇప్ప‌టికే కొంత‌మంది వ్యూహాత్మ‌కంగా త‌మ కొడుకుల‌ను పొలిటిక‌ల్ వార్‌లోకి దించేయగా.. ఇప్పుడు మ‌రో సీనియర్ నేత వార‌సుడు కూడా రాబోతున్నాడు. 


తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తమ కుటుంబసభ్యులను రాజకీయల్లోకి తెచ్చేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు నాయ‌కులు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తన కుమారుడిని మిర్యాలగూడ నుంచి రంగంలోకి దింపాలని భావిస్తుంటే, మరో కాంగ్రెస్ నేత రామిరెడ్డి దామోదర్ రెడ్డి కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు సర్వోత్తమ్ రెడ్డిని భువనగిరి ఎంపీగా నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని దామోదర్ రెడ్డి భావిస్తున్నారు. రామిరెడ్డి దామోదర్ రెడ్డి తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నల్లగొండ జిల్లాలో మంచి పేరున్న కుటుంబం కావడంతో ఆయనకే ప్రజలు అన్నిసార్లు పట్టం కట్టారు. 


దామోదర్ రెడ్డి రెండు సార్లు మంత్రిగా ప‌నిచేశారు. తాను రాజకీయాల్లో పవర్ ఫుల్ గా ఉన్నప్పుడే కుమారుడిని రంగంలోకి దించాలని యోచిస్తున్నారు. సర్వోత్తమ్ రెడ్డి విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించారు. మంచి కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం. ఆరంకెల జీతం. అన్నీ వదులుకుని నల్లగొండ జల్లాకు వచ్చారు. తన తండ్రి బాటలో నడవాలని నిర్ణయించుకున్నారు. 2019 ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు స్థానానికి పోటీ చేసేందుకు ఆయన ఉత్సాహం చూపుతున్నారు. అందుకోసం నియోజవర్గంలోని అన్ని ప్రాంతాల్లో సర్వోత్తమ్ రెడ్డి పర్యటిస్తున్నారు. సర్వోత్తమ్ రెడ్డికి కాంగ్రెస్ యువనేత రాహుల్ తో కూడా మంచి సంబంధాలున్నాయి


దీంతో తనకీసారి సీటు గ్యారంటీ అని సర్వోత్తమ్ రెడ్డి చెబుతున్నారు. గత ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా పోటీ చేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అయితే ఆయన ఈసారి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు, రామిరెడ్డి బ్రదర్స్ కు గతంలో సంబంధాలు అంతగా ఉండేవి కావు. అయితే ఈ మధ్య కాలంలో ఇద్దరు నేతలు సన్నిహితంగా మెలుగుతున్నారు. దీంతో తన కుమారుడి విజయానికి కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఒక చేయి వేస్తారని దామోదర్ రెడ్డి భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: