హైదరాబాద్: అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న టీడీపీని గాడిలో పెట్టేందుకు సినీ నటుడు, చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలక్రిష్ణ రంగంలోకి దిగారు. పార్టీని వీడిన వారిని తిరిగి పార్టీలోకి రప్పించే పనిలో నిమగ్నమైనట్లు కనిపిస్తోంది. ఈ మేరకు గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర్ రావుతో బాలక్రిష్ణ భేటీ అయ్యారు. రావిని పార్టీలోకి రావల్సిందిగా బాలక్రిష్ణ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దీనికి రావి కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. గత నెలలోనే గుడివాడ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడాలి నాని పార్టీని వీడారు. గుడివాడలో పార్టీ పరిస్థితి అయోమయంగా మారింది. పార్టీలో ఎవరు ఉన్నారు, ఎవరు లేరో తెలియని పరిస్థితి.ఈ పరిస్థితుల్లో గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావితో బాలక్రిష్ణ సమావేశమయ్యారు.
జూనియర్ ఎన్టీఆర్కు ఫాలోవర్ అయిన నానీ పార్టీని సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర్ రావుతో బాలక్రిష్ణ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. నిన్న గాక మొన్న జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశానికి బాలక్రిష్ష్ణ సోదరుడు, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరిక్రిష్ణ డుమ్మా కొట్టారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా గత కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో బాలక్రిష్ణ రంగంలోకి దిగాడు. గుడివాడ ఎమ్మెల్యే నాని పార్టీని వీడటంతో అక్కడ పార్టీ క్యాడర్ నిరుత్సాహానికి గురి కాకుండా, పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు నేరుగా బాలక్రిష్ణ దిగారు. మాజీ ఎమ్మెల్యే రావితో భేటీ కావడం, ఆయనను ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రావల్సిందిగా ఆహ్వానించడం, రావి కూడా సరే అనడం జరిగినట్లు సమాచారం. గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే వెళ్లడంతో ఏం చేయాలో బాబుకు తోచని పరిస్థితులో మాజీ ఎమ్మెల్యేను రప్పించడంతో బాలక్రిష్ణ సక్సెస్ అయ్యారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని గట్టెక్కించడానికి బాలక్రిష్ణ తనవంతుగా కష్టపడుతున్నాడు. అయితే, బాలక్రిష్ణ రంగ ప్రవేశంతో పార్టీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. నందమూరి వంశంతోనే తెలుగుదేశం పార్టీ బతికి బట్ట కలుగుతుందనీ వారంటున్నారు. ఏది ఏమైనా గత కొంత కాలంగా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. పార్టీ పటిష్టత కోసం బాలక్రిష్ణ రంగంలోకి దిగడంతోనైనా పార్టీ బలపడుతుందో లేదో చూడాలి మరి.
మరింత సమాచారం తెలుసుకోండి: