గాన గంధర్వుడు, స్వరాల సృష్టికర్త మధ్య ఊహించని యుద్ధం మొదలైంది. దశాబ్దాల తరబడి సంగీత సాగరాన్ని ప్రేక్షకులను రంజింపచేసిన వారి మధ్య స్వర జగడం మొదలైంది. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఇళయ రాజా లీగల్ నోటీసులు పంపారు. బాలు విదేశాల్లో గాన కచేరీల్లో ఎక్కువగా ఇళయరాజా పాటలు పాడుతున్నారని ఇంకెప్పుడూ ఆయన పాటలు పాడకూడదంటూ నోటీసులు పంపారు.
ఇళయరాజా నోటీసులతో బాలు షాక్ అయ్యారు. దీనిపై ఆయన తన ఫేస్ బుక్ ద్వారా స్పందించారు. ‘అందిరకీ నమస్కారం. వరల్డ్ టూర్లో భాగంగా గత వారం సియాటిల్, లాస్ఏంజెల్స్లో మంచి కచేరీలు ఇచ్చాం. మీరంతా మా ప్రోగ్రామ్ని ఆనందించినందుకు ధన్యవాదాలు. కొన్ని రోజుల క్రితం ఇళయరాజా గారి పేరిట నాకు నోటీసులు అందాయి. నాతో పాటు చిత్ర, నా కుమారుడు చరణ్‌కి కూడా నోటీసులు వచ్చాయి.
వీటిల్లో ఇళయరాజా అనుమతి లేకుండా ఆయన పాటలు పాడకూడదని.. అలా చేస్తే అది కాపీరైట్ నిబంధనలు అతిక్రమించినట్లు అవుతుందని.. ఇందుకు పరిహారంగా పెద్ద మొత్తంలో జరిమానా కట్టాల్సిన వస్తుందని రాసుంది. కానీ ఈ విషయంలో నాకు ఎటువంటి సంబంధంలేదు. నా కుమారుడు చరణే ‘ఎస్పీబీ 50’ పేరిట ఆగస్ట్‌లో ఈ వరల్డ్ టూర్ కార్యక్రమం ప్రారంభించాడు. దీనిలో భాగంగా మేము భారత్‌తో పాటు టొరంటో, రష్యా, శ్రీలంక, మలేసియా, సింగపూర్, దుబాయ్‌ల్లో చాలా ప్రదర్శనలు ఇచ్చాం. అప్పటి వరకు మాకు ఎలాంటి నోటీసులు రాలేదు. కానీ మేము అమెరికాలో కచేరీ నిర్వహిస్తుంటే ఈ నోటీసుల గొడవ మొదలైంది.
ముందుగా చెప్పినట్లు నాకు ఈ నోటీసుల విషయంలో ఎలాంటి సంబంధంలేదు. చట్టాన్ని నేను గౌరవిస్తాను. ఈ నేపథ్యంలో మా ట్రూప్ ఇళయరాజా పాటలు పాడలేం. కానీ కచేరీ జరగాల్సిందే.. దేవుడి దయవల్ల నేను కంపోజ్ చేసిన పాటలు కూడా ఉన్నాయి.. కాబట్టి అవే పాడబోతున్నాం. నేను మీకొక్కటే విన్నవించుకోవాలనుకుంటున్నాను. దయచేసి ఈ విషయాన్ని పెద్దది చేసి తప్పుడు ప్రచారాలు చేయద్దు. ఇది దేవుడి మహిమే అయి ఉంటే దాన్ని భక్తితో స్వాగతిస్తాను. సర్వేజనా సుఖినోభవంతు’ అని బాలు స్పందించారు.