తల్లిదండ్రులొద్దు.. ప్రియుడే ముద్దు...!!

Shyam Rao

సభ్య సమాజం ఆధునిక పోకడలు తొక్కే కొద్దీ మనుషుల ఆలోచనలు వింత పోకడలు తొక్కుతున్నాయి. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ సంఘటన. పట్టుమని పదోతరగతి కూడా పుర్తవ్వని ఒక అమ్మాయి సోషల్ మీడియా వలలో చిక్కుకొని కన్న తల్లిదండ్రులను నానా ఇబ్బందులకు గురి చేసింది. బెంగళూరులో నివసిస్తున్న మార్బుల్‌ వ్యాపారి కుమార్తె 9వ తరగతి చదువుతోంది. ఏడు నెలల క్రితం సంతోష్‌నగర్‌కు చెందిన షోయబ్‌ ఫేస్‌బుక్‌ ద్వారా ఆమెకు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పింది.



అయితే ఈ ప్రేమ రామాయణం ఇంకా ముదరడంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులను వదిలి వచ్చేస్తానని చెప్పడంతో అబ్బాయి దానికి ఓకే చెప్పాడు.  దీంతో పదిరోజుల క్రితం బాలిక బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. షోయబ్‌, అతడి స్నేహితులతో కలిసి సాలార్‌జంగ్‌ మ్యూజియం, నగరంలోని పార్కులు చుట్టేసింది. తన కుమార్తె కనిపించపోవడంతో తల్లి తల్లడిల్లి పోయి బెంగళూరు హెబ్బళి పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేసింది. వారు బాలిక చరవాణిపై నిఘా ఉంచగా... ఈనెల 6న హైదరాబాద్‌లో ఉన్నట్టు ఆచూకీ లభించింది. తీరా పోలీసులు విషయం పై ఆరా తీయగా ప్రియుణ్ని పెళ్లిచేసుకొనేందుకు పోలీసులకు కల్లబొల్లి కబుర్లను గుదిగుచ్చింది ఆ అమ్మాయి.



తనకున్న రూ.కోట్ల ఆస్తులను సొంతం చేసుకొనేందుకు పిన్ని చిత్రహింసలు పెడుతున్నారంటూ వారిపై ఫిర్యాదు చేసింది. ఒక్కసారిగా బెంగళూరు పోలీసులు తల్లితో సహా హైదరాబాద్‌కు రావడంతో కట్టుకథలన్నీ రట్టయ్యాయి. ఇంతజరిగినా తల్లిదండ్రుల వద్దకు తాను ససేమిరా వెళ్లననడంతో బాలికను పోలీసులు భరోసా కేంద్రానికి పంపించి మానసిక నిపుణులకు అప్పగించారు. కౌన్సెలింగ్‌ ద్వారా ప్రేమ, ఆకర్షణ అంశాలపై అవగాహన కల్పించి బెంగళూరుకు తిరిగివెళ్లేలా చేయాలని అభ్యర్థించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: