రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులతో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్వహించిన సమావేశంలో తెలంగాణ అంశం కూడా చర్చకు వచ్చింది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ, సీఎం కిరణ్ రాష్ట్ర విభజన అంశంపై ఏం మాట్లాడారన్నది హాట్ టాపిక్ గా మారింది.
రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై నిర్మొహమటంగా అభిప్రాయాలు చెప్పాలని రాహుల్ సూచించడంతో బొత్స సత్యనారాయణ తెలంగాణ అంశం గురించే ప్రధానంగా మట్లాడినట్టు తెలిసింది. తెలంగాణపై తేల్చకుంటే రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో పార్టీకి నష్టమనేనని బొత్స తేల్చి చెప్పినట్టు సమాచారం.
రాష్ట్ర విభజనపై ఎంత నాన్చితే అంత నష్టమని, ఎన్నికలలోపు తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం ప్రకటించకుంటే... రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్, టీఆర్ఎస్లు లబ్ధి పొందే అవకాశాలున్నాయని బొత్స రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. ఒక సీఎం కిరణ్ కూడా రాష్ట్రాన్ని విభజించినా, సమైక్యంగా ఉంచినా.. ఏదో ఒక నిర్ణయం మాత్రం వీలైనంత త్వరగా తీసుకుంటేనే రాజకీయంగా ఉపయోగం ఉంటుందని సీఎం కిరణ్ చెప్పారు.
తెలంగాణపై నిర్ణయం తర్వాత ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని సీఎం కిరణ్ స్పష్టం చేసినట్టు సమాచారం. అభివృద్ధి, సమస్యలు, పార్టీ ఎన్నికల వ్యూహాలు ప్రత్యేక తెలంగాణా అంశంతోనే ముడిపడి ఉన్నాయని... విభజన అంశం తేలితేగానే అడుగు ముందుకు వేయలేమని కిరణ్ చెప్పుకొచ్చారు.
అయితే రాహుల్ ఏ నిర్ణయం తీసుకుంటే నష్టం ఎక్కువ ఉంటుంది..? అనే దానిపై సీఎం కిరణ్‌ను అడగగా.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితేనే లాభమనే కోణంలో ఆయన సమాధానమిచ్చినట్లు తెలిసింది. అయితే పీసీసీ అధ్యక్షుడు బొత్స మాత్రం.. సమైక్యమా...? ప్రత్యేకమా..? అనే దానిపై తన అభిప్రాయం చెప్పకుండా.. నిర్ణయం మాత్రం సత్వరం తీసుకోవాలని కోరినట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
మొత్తానికి రాష్ట్ర విభజన అంశంపై ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిదన్న అభిప్రాయాన్ని సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స రాహుల్ కు స్పష్టం చేశారు. మరి రాహుల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది మాత్రం తేలాల్సి ఉంది.
మరింత సమాచారం తెలుసుకోండి: