ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన ఒబామా అధికారికంగా పదవీబాధ్యతలు స్వీకరించారు. వరసగా రెండోసారి ఆ పీఠాన్ని అందుకోవడమనే గౌరవం దక్కిన అతికొద్ది మందిలో ఆయన చేరిపోయారు.
ఒబామా కు ముందున్నది పూల దారికాదు ముళ్ళ బాట అని కొన్ని ఘటనలు నిరూపించాయి. రెండు మూడుచోట్ల ఉన్మాదులు రెచ్చిపోయి 20 మంది చిన్నారులతోసహా పలువురిని పొట్టనబెట్టుకున్నారు. పర్యవసానంగా విచ్చలవిడిగా తుపాకులు లభించడాన్ని నియంత్రించే చట్టం తక్షణం తీసుకురావాలన్న డిమాండు అజెండాలోకొచ్చింది. ఉగ్రవాదంపై యుద్ధం పేరిట గత పన్నెండేళ్ళ నుండి అమెరికా ప్రారంభించిన పోరాటం ఎన్నో మలుపులు తిరిగినా ఉగ్రవాదులు ఎక్కడా తగ్గిన దాఖలాలు కనబడవు. ఒకపక్క పాకిస్థాన్-అఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లోని గిరిజన గ్రామాల్లో అల్ కాయిదా ఉగ్రవాదులు తలదాచుకున్నారంటూ అక్కడ అ ద్రోన్ దాడులకు దిగుతుంటే , ఆఫ్రికా, లిబియా ఇలా ఊహకందని తీరాలకు ఉగ్రవాదం విస్తరిస్తున్నదని అల్జీరియా ఘటన వెల్లడిస్తోంది. తొలిసారి తాను అధ్యక్ష పదవి చేపట్టిననాటికి అమెరికాను చుట్టుముట్టిన ఆర్ధికమాంద్యంపై దృష్టిపెట్టడమే ఆయనకు తలకు మించిన భారంగా పరిణమించింది.
అమెరికా రుణ భారం పదహారు లక్షల కోట్ల డాలర్లు దాటిపోయింది. నిరుద్యోగమూ తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. ఆర్ధిక రంగం ఇంకా చురుకుదనాన్ని సంతరించుకోలేదు. అంతర్జాతీయంగా చూస్తే అమెరికాకు తగిలిన దెబ్బలు చిన్నవేమీ కాదు. గత ఏడాది సెప్టెంబర్‌లో లిబియాలోని బెంఘాజీలో అమెరికా దౌత్య కార్యాలయంపై ఉగ్రవాదులు దాడిచేసి నలుగురు అమెరికన్లను హతమార్చిన ఉదంతం కూడా దానికి చేదు జ్ఞాపకమే. ఆంక్షలెన్ని విధించినా ధిక్కార స్వరాన్నే వినిపిస్తున్న ఇరాన్ కూడా అమెరికాకు కొరకరాని కొయ్యగానే ఉంది. పశ్చిమాసియాలో శాంతి సాధించడం అన్నది కలలా నే మిగిలిపోయింది.ఇన్ని సమస్యలు మధ్య భవిష్యత్తుపై ఎంతో విశ్వాసంతో ఒబామా తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు.
మరింత సమాచారం తెలుసుకోండి: